Jio: రిలయన్స్ జియో మరో మాస్టర్ ప్లాన్... డిసెంబర్ నాటికి చౌక ధరలో 10 కోట్ల స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి!

  • ఆండ్రాయిడ్ ప్లాట్ ఫామ్ పై తయారు
  • ఇప్పటికే జియో ప్లాట్ ఫామ్స్ లో భారీ పెట్టుబడి
  • ఇన్వెస్ట్ చేసిన దిగ్గజ సంస్థలు
Jio To Release 10 Crores Low Cost Phones by December

రిలయన్స్ ఇండస్ట్రీస్ లో టెలికం విభాగమైన జియో, ఈ సంవత్సరం చివరికి భారత మార్కెట్లోకి 10 కోట్ల చౌక స్మార్ట్ ఫోన్లను అందించేందుకు ప్రణాళికలు రూపొందించిందని తెలుస్తోంది. ఇవన్నీ గూగుల్ ఆండ్రాయిడ్ ప్లాట్ ఫామ్ పై తయారవుతాయని, ఔట్ సోర్సింగ్ విధానంలో వీటి తయారీ ఇప్పటికే ప్రారంభమైపోయిందని 'బిజినెస్ స్టాండర్డ్' పత్రిక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఈ ఫోన్లు 4జీ, 5జీ రేడియో తరంగాలకు మద్దతిస్తాయని పేర్కొంది.

ఇటీవల రిలయన్స్ అనుబంధ సంస్థల్లోకి గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ సహా ఎన్నో కంపెనీలు పెట్టుబడులు పెట్టగా, రిలయన్స్ ఇండియాలోనే అత్యధిక విలువైన సంస్థగా అవతరించిన సంగతి తెలిసిందే. జూలైలో జరిగిన వాటాదారుల సమావేశంలో ప్రసంగించిన ముఖేశ్ అంబానీ సైతం ఆండ్రాయిడ్ ప్లాట్ ఫామ్ పై 4జీ, 5జీ ఫోన్లను అందరికీ అందుబాటులోకి తెస్తామని, ఫోన్ ను స్వయంగా రిలయన్స్ డిజైన్ టీమ్ తయారు చేస్తుందని వెల్లడించారు కూడా.

రిలయన్స్ అనుబంధ డిజిటల్ విభాగం జియో ప్లాట్ ఫామ్స్ లో దాదాపు 33 శాతం వాటాలను అధినేత ముఖేశ్ విక్రయించగా, 1.52 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడిగా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మొత్తంతో రిలయన్స్ రుణరహిత సంస్థగా నిలిచింది. జియో ప్లాట్ ఫామ్స్ లో ఆల్ఫాబెట్ తో పాటు ఫేస్ బుక్, ఇంటెల్, క్వాల్ కామ్ వంటి టెక్ దిగ్గజాలు పెట్టుబడులను పెట్టాయి.

More Telugu News