MS Dhoni: గతంలో ఎన్నడూ చూడని ధోనీని ఇప్పుడు చూశాను: ఇర్ఫాన్ పఠాన్

All Will See a New Dhoni in this IPL says Irfan
  • మరో వారంలో దుబాయ్ వేదికగా ఐపీఎల్
  • తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్న అన్ని టీమ్ లు
  • ట్రయినింగ్ డ్రిల్ లో ధోనీ అద్భుతమన్న ఇర్ఫాన్
మరో వారం రోజుల్లో దుబాయ్ వేదికగా, ఐపీఎల్ క్రికెట్ పోటీలు ప్రారంభం కానుండగా, ప్రస్తుతం అన్ని జట్లూ ముమ్మరంగా ప్రాక్టీసులో నిమగ్నమై ఉన్నాయి. మిగతా ఫ్రాంచైజీలతో పోలిస్తే, చెన్నై జట్టే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. దుబాయ్ లో అడుగు పెట్టినప్పటి నుంచి ఆటగాళ్లకు కరోనా పాజిటివ్ రావడం, సురేశ్ రైనా తన వ్యక్తిగత కారణాలతో వెళ్లిపోవడం, ఆపై హర్భజన్ దూరం కావడం... ఇలా ఎన్నో వార్తలు చెన్నై జట్టుపై వచ్చాయి.

ఇక తాజాగా, చెన్నై జట్టు ప్రాక్టీస్ లో ధోనీ ఇరగదీస్తున్నాడన్న వార్తలు వస్తున్నాయి. తాజాగా ఇర్ఫాన్ పఠాన్, ధోనీ ప్రాక్టీస్ గురించి మాట్లాడుతూ, తాను గతంలో ఎన్నడూ చూడని ధోనీని చూశానని వ్యాఖ్యానించడం గమనార్హం. నెట్స్ లో వికెట్ కీపింగ్ చేసినా, బ్యాటు పట్టుకున్నా, తనకు తానే సాటన్న విధంగా ధోనీ ఆడుతున్నాడని కితాబిచ్చారు. ట్రయినింగ్ డ్రిల్ లో ధోనీ నైపుణ్యం అద్భుతమని అన్నాడు.

ఏడాది తరువాత తాను ధోనీ ఆటను చూశానని, ఏ మాత్రమూ తేడా కనిపించక పోగా, ధోనీలోని సత్తా మరింతగా పెరిగిందని ఇర్ఫాన్ పఠాన్ వ్యాఖ్యానించాడు. వికెట్ల వెనుక తాను కొత్త ధోనీని చూశానని, గతంలో ఎన్నడూ లేనంత స్టామినా కనిపించిందని, ఈ ఐపీఎల్ లో ధోనీ ఆటతీరు అభిమానులను అలరిస్తుందని అన్నాడు. తాజా ఐపీఎల్ కు ధోనీ కొత్త కళను తేనున్నాడని చెప్పుకొచ్చాడు.

ధోనీ ఎంతో కాలంగా క్రికెట్ ను ఆడుతున్నాడన్న కారణంగా తాను ఈ మాటలను చెప్పడం లేదని, లెగ్ స్పిన్ బౌలింగ్ లో సైతం ధోనీ కీపింగ్ ను చాలా దగ్గరగా తాను చూశానని ఇర్ఫాన్ అన్నాడు. ప్రస్తుతం ధోనీ ప్రతి క్షణమూ ప్రాక్టీస్ పైనే దృష్టిని పెట్టాడని, అతని ఆటను ప్రతి ఒక్కరూ అతి త్వరలో చూడబోతున్నారని చెప్పుకొచ్చాడు.
MS Dhoni
Irfan Pathan
Practice
Dubai
IPL

More Telugu News