China: ఆ ఐదుగురూ మా దగ్గరే ఉన్నారు.. ఎట్టకేలకు అంగీకరించిన చైనా

China Confirms 5 Missing Arunachal Men  Found By Their Side
  • మెక్‌మెహన్ రేఖ వద్ద పొరపాటున చైనా భూభాగంలోకి
  • ఐదుగురిని అదుపులోకి తీసుకున్న చైనా ఆర్మీ
  • హాట్‌లైన్ ద్వారా భారత ఆర్మీకి సమాచారం
అరుణాచల్ ప్రదేశ్‌లో అదృశ్యమైన ఐదుగురు యువకుల జాడ ఎట్టకేలకు తెలిసింది. వారిని చైనా అపహరించిందంటూ గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలపై చైనా ఎట్టకేలకు స్పందించింది. ఆ ఐదుగురు వేటగాళ్లు తమ వద్దే ఉన్నారని ప్రకటించింది. అప్పర్ సుబాన్‌సిరి జిల్లా నాచో ప్రాంతం నుంచి సరిహద్దులోని అడవుల్లో వేటకు వెళ్లిన ఐదుగురిని గురువారం మెక్‌మెహన్ రేఖ వద్ద చైనా సైన్యం అపహరించిందని, అక్కడి నుంచి తప్పించుకు వచ్చిన ఇద్దరు యువకులు తెలిపారు. వారి సమాచారాన్ని తెలియజేసేందుకు చైనా సైన్యం నిరాకరించింది.

అయితే, తాజాగా వారి విషయంలో చైనా ప్రకటన చేసింది. ఆ ఐదుగురు తమ వద్దే ఉన్నారని అంగీకరించింది. వారు తమ భూభాగంలో కనిపించడంతో అదుపులోకి తీసుకున్నట్టు తెలిపింది. ఈ మేరకు మంగళవారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో హాట్‌లైన్ ద్వారా భారత సైనికులకు సమాచారం చేరవేసింది. ఈ విషయాన్ని అరుణాచల్ ప్రదేశ్ ఎంపీ, కేంద్ర సహాయమంత్రి కిరణ్ రిజుజు ట్విట్టర్ ద్వారా తెలిపారు.

చైనా అదుపులో ఉన్న ఆ ఐదుగురిని వెనక్కి తీసుకొచ్చేందుకు చర్చలు జరుపుతున్నట్టు తెలిపారు. కాగా, మెక్‌మెహన్ రేఖ వద్ద సరిహద్దు విషయంలో స్పష్టత లేకపోవడం, ఆ ప్రాంతమంతా దట్టమైన అటవీప్రాంతం కావడంతో రెండువైపుల ప్రజలు తరచూ ఇతర దేశాల భూభాగంలోకి వెళ్తుండడం చాలా సాధారణ విషయమని సైన్యం తెలిపింది.
China
India
Arunachal Pradesh
Youth

More Telugu News