Rhea Chakraborty: సుశాంత్ వ్యవహారంలో నటి రియా చక్రవర్తి అరెస్ట్

NCB Officials arrests alleged actress Rhea Chakraborty
  • సుశాంత్ మరణంలో డ్రగ్స్ కోణం
  • ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తి
  • సుశాంత్ కోసం డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు ఇప్పటికే అంగీకారం!
బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ వ్యవహారంలో డ్రగ్స్ కోణం ఉందన్న ఆరోపణల నేపథ్యంలో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఎన్సీబీ అధికారులు నటి రియా చక్రవర్తిని అరెస్ట్ చేశారు. సుశాంత్ గాళ్ ఫ్రెండ్ గా గుర్తింపు తెచ్చుకున్న రియాను ఎన్సీబీ అధికారులు గత కొన్నిరోజులుగా విచారిస్తున్నారు. ఈ విచారణలో తాను సుశాంత్ కోసం డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు రియా అంగీకరించింది. ఆమె నుంచి ఇప్పటికే కీలక సమాచారం రాబట్టిన ఎన్సీబీ... మరింత సమాచారం తెలుసుకునేందుకు ఆమెను అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది.

దర్యాప్తులో ఎన్సీబీ వేగం పెంచడం చూస్తుంటే సుశాంత్ మరణంలో డ్రగ్స్ వ్యవహారమే కేంద్రబిందువుగా ఉన్నట్టు అనిపిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే సీబీఐ, ఈడీ దర్యాప్తు చేస్తున్నాయి.

కాగా, రియా చక్రవర్తి ప్రస్తుతం ముంబయిలోని ఎన్సీబీ కార్యాలయంలో ఉంది. ఆమెను ఇవాళ రెండు దఫాలుగా విచారించిన ఎన్సీబీ అధికారులు మరోసారి విచారించేందుకు సిద్ధమవుతున్నారు. రియాను ఇవాళ కోర్టు ముందు హాజరుపరిచే అవకాశాలు కనిపించడంలేదు. రియాకు తొలుత వైద్య పరీక్షలు నిర్వహించాలని నార్కొటిక్స్ అధికారులు భావిస్తున్నారు.
Rhea Chakraborty
NCB
Arrest
Sushant Singh Rajput
Death
Drugs
Bollywood

More Telugu News