ప్రేమికుల మధ్య గొడవ.. ప్రియుడి ఆత్మహత్య, ప్రియురాలి ఆత్మహత్యాయత్నం

08-09-2020 Tue 08:38
  • విశాఖపట్టణంలో ఘటన
  • మూడో అంతస్తు నుంచి దూకి యువతి ఆత్మహత్యాయత్నం
  • ఆందోళనకరంగా పరిస్థితి
Young man suicide in visakha after an argue with lover
ప్రేమికుల మధ్య జరిగిన గొడవ ప్రియుడి ఆత్మహత్యకు, ప్రియురాలి ఆత్మహత్యాయత్నానికి దారితీసిన ఘటన విశాఖపట్టణంలోని మధురవాడలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. వైఎస్సార్ నగర్ కాలనీలో బ్లాక్ నంబర్ 13లో నివసించే అరుణ్ కుమార్ (23) ఓ ఫుడ్ డెలివరీ సంస్థలో పనిచేస్తున్నాడు. కరోనా వైరస్ నేపథ్యంలో పనిలేక ప్రస్తుతం ఇంటి వద్దే ఉంటున్న అరుణ్ అదే కాలనీకి చెందిన అనితతో ప్రేమలో పడ్డాడు. సోమవారం రాత్రి ప్రేమికుల మధ్య గొడవ జరిగింది.

దీంతో తీవ్ర మనస్తాపం చెందిన అరుణ్ కుమార్ ఇంట్లోని ప్యాన్‌కు ఉరివేసుకున్నాడు. విషయం తెలిసిన అనిత తానుంటున్న భవనం మూడో అంతస్తు నుంచి కిందికి దూకేసి ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన ఇరుగుపొరుగు వారు తీవ్రంగా గాయపడిన అనితను వెంటనే ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.