bsnl: మ‌రో 20 వేల మంది‌ని ఉద్యోగాల నుంచి తొల‌గించ‌ను‌న్న బీఎస్ఎన్ఎల్

  • ఉద్యోగులు ఉసురు తీస్తోన్న క‌రోనా
  • ఇప్ప‌టికే బీఎస్ఎన్ఎల్ లో 30 వేల ఉద్యోగాలు స్వాహా
  • ఉద్యోగాలు తీయొద్ద‌ని కార్మికుల వినతి 
jobs loss in bsnl

క‌రోనా వైర‌స్ వ‌ల్ల ఏర్ప‌డిన సంక్షోభం ఉద్యోగుల ఉసురుతీస్తోంది. ఇప్ప‌టికే ఎన్నో రంగాల వారు వేల సంఖ్య‌లో ఉద్యోగాలు కోల్పోయిన విష‌యం తెలిసిందే. ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ నుంచి మ‌రో 20 వేల మంది కాంట్రాక్టు కార్మికులను తొల‌గించాల‌ని అధికారులు యోచిస్తున్నారు. దీంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఆలోచ‌న‌ను విర‌మించుకోవాల‌ని, క‌రోనా సంక్షోభ స‌మ‌యంలో త‌మ‌ను మ‌రిన్ని క‌ష్టాల్లోకి నెట్టొద్ద‌ని ఉద్యోగ సంఘాలు వేడుకుంటున్నాయి.

అయితే, ఇప్ప‌టికే ఉద్యోగాల తొలగింపుకు సంబంధించి ఈ నెల‌ 1న బీఎస్ఎన్ఎల్ తన హెచ్ఆర్ డైరెక్టర్ అనుమతితో ఒక ఉత్తర్వు జారీ చేసిందని ఆ సంస్థ ఉద్యోగ సంఘం పేర్కొంది. కాంట్రాక్ట్ పనులతో పాటు కాంట్రాక్ట్‌  కార్మికుల ఖర్చులను తగ్గించుకునే క్రమంలో ఉద్యోగాలు తొలగించాల‌ని యోచిస్తోంద‌ని తెలిపింది. ఈ మేర‌కు అన్ని చీఫ్ జనరల్ మేనేజర్లు చర్యలను తీసుకోవాలని కోరినట్టు చెప్పింది.

ఇప్పటికే త‌మ సంస్థ 30 వేలమంది కార్మికులను తొలగించిందని వారు అన్నారు. స్వచ్ఛంద పదవీ విరమణ పథకం (వీఆర్‌ఎస్) అమలు తర్వాత సంస్థ ఆర్థిక పరిస్థితి క్షీణించిందని చెప్పింది. కాగా, రూ.900 కోట్ల విలువైన పెండింగ్ బకాయిలను బీఎస్‌ఎన్‌ఎల్‌ చెల్లించకపోతే ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్ ప్రాజెక్టులో పనిచేస్తున్న వారిని ఇంటికి పంపిస్తామ‌ని గతనెలలో ఫిన్నిష్ టెలికాం పరికరాల సంస్థ నోకియా తెలిపింది. దీంతో ఉద్యోగులు మ‌రింత ఆందోళ‌న‌లో ఉన్నారు.

More Telugu News