Ragini Dwivedi: కన్నడ సినీ నటి రాగిణి ఇంటిలో సోదాలు జరిపిన సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్!

CCB police raided Kannada Actress Ragini Dwivedis house
  • శాండల్ వుడ్ ను షేక్ చేస్తున్న డ్రగ్స్ కేసు
  • విచారణను ముమ్మరం చేసిన సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్
  • కోర్టు వారంట్ తో రాగిణి ఇంట్లో సోదాలు నిర్వహించిన అధికారులు
సినీ ఇండస్ట్రీకి, డ్రగ్స్ మాఫియాకు లింకులు ఉన్నాయనే ఆరోపణలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. కొంత కాలం క్రితం టాలీవుడ్ ని సైతం డ్రగ్స్ విచారణ వణికించింది. ఆ తర్వాత ఆ కేసు మరుగున పడిపోయింది. వాస్తవాలు బయటకు రాలేదు.

తాజాగా బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య తర్వాత డ్రగ్స్ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఇప్పటికే సుశాంత్ మాజీ ప్రియురాలు రియా, ఆమె సోదరుడు ఈ కేసుకు సంబంధించి విచారణ ఎదుర్కొంటున్నారు.

మరోవైపు కన్నడ సినీ పరిశ్రమను సైతం డ్రగ్స్ భూతం షేక్ చేస్తోంది. కన్నడ నటి రాగిణి ద్వివేదికి నిన్న సమన్లు జారీ చేసిన సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) పోలీసులు... ఈ ఉదయం బెంగళూరులోని ఆమె నివాసంలో సోదాలు నిర్వహించారు. కోర్టు ఇచ్చిన సెర్చ్ వారంట్ తోనే సోదాలు నిర్వహించామని సీసీబీ అధికారులు ఈ సందర్భంగా  తెలిపారు.

సీసీబీ పంపిన సమన్లకు నిన్న రాగిణి స్పందించలేదు. ఆమె తరపున లాయర్లను పంపింది. సోమవారం వరకు తనకు సమయం కావాలని కోరింది. ఆమె విన్నపాన్ని తిరస్కరించిన అధికారులు... ఈరోజు నేరుగా వెళ్లి, ఆమె ఇంటి తలుపు తట్టారు.

మరోవైపు, ఇంతకు ముందే కన్నడ ఫిల్మ్ మేకర్, జర్నలిస్ట్ ఇంద్రజిత్ లంకేశ్ ను సీసీబీ పోలీసులు విచారించగా... ఆయన పలు సంచలన విషయాలను విచారణలో వెల్లడించారు. అనేక మంది సెలబ్రిటీలు డ్రగ్స్ వాడుతున్నారని తెలిపారు. కొందరి పేర్లను కూడా ఆయన వెల్లడించినట్టు సమాచారం. ఆయన వాంగ్మూలం మేరకు  సీసీబీ అధికారులు తమ విచారణను ముమ్మరం చేశారు. ఇప్పటికే  రాగిణి స్నేహితుడు రవిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు శాండల్ వుడ్ ను షేక్ చేస్తున్నాయి. ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయోనని జనాలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
Ragini Dwivedi
Sandalwood
Kannada Actress
Drugs
CCB

More Telugu News