Ganapathi: గణపతి లొంగుబాటు పోలీసుల కట్టుకథ... మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రకటన

  • మావో అగ్రనేత గణపతి లొంగుబాటు అంటూ కథనాలు
  • ఈ కట్టుకథ వెనుక మోదీ, కేసీఆర్ ప్రభుత్వాలున్నాయని మావోల ఆగ్రహం
  • ఉద్యమాన్ని ఆపేది లేదని స్పష్టీకరణ
Maoist central committee responds news about surrender of Ganapathi

మావోయిస్టు అగ్రనేత గణపతి సహా ఇతర సీనియర్లు లొంగిపోతున్నారంటూ వచ్చిన కథనాలపై మావోయిస్టు కేంద్ర కమిటీ స్పందించింది. గణపతి లొంగుబాటు పోలీసుల కట్టుకథ అని మావోయిస్టు కేంద్ర అధికార ప్రతినిధి అభయ్ స్పష్టం చేశారు. మోదీ, కేసీఆర్ ప్రభుత్వాలు ఈ కట్టుకథ వెనుక ఉన్నాయని ఆరోపించారు. అనారోగ్యంతోనే గణపతి పార్టీ నాయకత్వం నుంచి స్వచ్ఛందంగా తప్పుకున్నారని, తమ పార్టీ ప్రతిష్ఠతను దెబ్బతీసేందుకే ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సిద్ధాంతపరంగా, రాజకీయంగా ఎంతో దృఢంగా ఉన్నామని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ముచ్చెమటలు పట్టిస్తున్నామని ఆ లేఖలో పేర్కొన్నారు. నరహంతక మోదీ పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ పతనమైందని, కరోనా మహమ్మారి గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ జనవరిలోనే చెప్పినా, మోదీ సర్కారు మాత్రం ప్రపంచ టెర్రరిస్టు ట్రంప్ సేవలో తరించిపోయిందని విమర్శించారు. లాక్ డౌన్ అంటేనే ఫాసిస్టు తరహా నిర్బంధం అని ప్రజలకు అర్థమైపోయిందని వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో మావోయిస్టు పార్టీ ఒక్కటే ప్రత్యామ్నాయం అని దేశ ప్రజలు భావిస్తున్నారని అభయ్ పేర్కొన్నారు.

ప్రభుత్వాల దుర్మార్గాలకు వ్యతిరేకంగా పోరాడాలని, ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళతామని స్పష్టం చేశారు. దేశభక్తి పేరుతో చైనా యాప్ లను నిషేధించి గూగుల్, రిలయన్స్ లకు దేశ మార్కెట్ ను అప్పగించారని ఆరోపించారు. ప్రశ్నించే గొంతుకలు, సామాజిక కార్యకర్తలపై కేసులు పెట్టి జైళ్లలో నిర్బంధిస్తున్నారని, కశ్మీర్ లో సైనిక బలగాలను దించి మరో పాలస్తీనాగా మార్చారని ఆ ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

More Telugu News