APSRTC: హైదరాబాదుకు బస్సులను నడపడంపై జగన్ కీలక ఆదేశాలు!

Jagan orders to take action to run buses to Hyderabad
  • తెలంగాణకు బస్సులు తిప్పేందుకు చర్యలు తీసుకోండి
  • అవసరమైతే న్యాయ సలహా తీసుకోండి
  • సగం సీట్లను మాత్రమే నింపి బస్సులను నడపండి
కరోనా నేపథ్యంలో ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు సర్వీసులు ఇంకా పునఃప్రారంభం కాలేదు. ఇరు రాష్ట్రాల ఆర్టీసీ అధికారుల మధ్య చర్చలు కొనసాగుతున్నప్పటికీ... బస్సుల సంఖ్యకు సంబంధించి తుది నిర్ణయానికి రాలేకపోయారు.

ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ కీలక ఆదేశాలను జారీ చేశారు. హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని ఇతర ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులను తిప్పేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈరోజు జరిగిన కేబినెట్ సమావేశంలో... తెలంగాణకు ఆర్టీసీ బస్సులను నడిపే అంశాన్ని జగన్ దృష్టికి మంత్రులు బొత్స సత్యనారాయణ, పేర్ని నాని తీసుకెళ్లారు.

ఈ అంశంపై జగన్ మాట్లాడుతూ, బస్సులను తిప్పేందుకు అవసరమైతే న్యాయ సలహాను తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కరోనా నేపథ్యంలో సగం సీట్లను మాత్రమే నింపి బస్సులను నడపాలని సూచించారు. సీటు-సీటుకు మధ్య ఒక సీటును కచ్చితంగా ఖాళీగా వదలాలని, ప్రయాణికుల మధ్య భౌతికదూరం ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రయాణికులకు మాస్క్ తప్పనిసరి చేయాలని... బస్టాండ్ లో దిగగానే థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలను నిర్వహించాలని ఆదేశించారు.
APSRTC
Buses
Andhra Pradesh
Telangana
Jagan

More Telugu News