Maoist: లొంగిపోయేందుకు సిద్ధమవుతున్న మావోయిస్టు పార్టీ మరో అగ్రనేత వేణుగోపాల్

  • అనారోగ్య కారణాలతో నిర్ణయం
  • గణపతితో పాటే లొంగిపోయే యోచన
  • ఎవరు వచ్చినా స్వాగతిస్తామన్న పోలీసులు
గత రెండేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న మావోయిస్టు పార్టీ అగ్రనేత గణపతి అలియాస్ ముప్పాల లక్ష్మణరావు లొంగిపోయేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు వార్తలు వెలువడిన మరుసటి రోజే మరో అగ్రనేత, మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, పొలిట్‌బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్‌ అలియాస్‌ భూపతి కూడా లొంగిపోయేందుకు సిద్ధమవుతున్నట్టు వార్తలు బయటకు వచ్చాయి.

గణపతితోపాటే లొంగిపోవాలని ఆయన భావిస్తున్నట్టు సమాచారం. వేణుగోపాల్ కూడా అనారోగ్య కారణాల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. మావోయిస్టు పార్టీలో అగ్రనాయకత్వంలో పనిచేసిన కిషన్‌జీ అలియాస్ మల్లోజుల కోటేశ్వరరావుకు వేణుగోపాల్ స్వయానా తమ్ముడు.

పార్టీలో కీలక పాత్ర పోషించిన మల్లోజుల 2010లో చెరుకూరి రాజ్‌కుమార్ అలియాస్ ఆజాద్ మరణం తర్వాత పార్టీ అధికార ప్రతినిధిగా నియమితుడయ్యారు. 2010లో దంతెవాడ ఘటనలో 70 మందికిపైగా సీఆర్‌పీఎఫ్‌ బలగాలు మృతి చెందడం వెనక వేణుగోపాల్‌ ప్రమేయం ఉందని పోలీసులు భావిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, చత్తీస్‌గఢ్‌లలో వేణుగోపాల్ తలపై రివార్డు కూడా ఉంది. మావోయిస్టు అగ్రనేతల లొంగుబాటును స్వాగతిస్తున్న పోలీసులు వారితో సహా ఎవరు వచ్చినా స్వాగతిస్తామని పేర్కొన్నారు. ఉద్యమంలోకి వెళ్లి తుపాకి పట్టిన మల్లోజుల మంచి రచయిత కూడా. గిరిజన, గోండు జీవితాలకు అక్షర రూపం ఇచ్చారు. సాధన కలం పేరిట అనేక పుస్తకాలు రాశారు.
Maoist
Ganapthi
Mallojula Venugopal
Telangana

More Telugu News