Suresh Raina: రైనాకు కటీఫ్ చెప్పేసిన చెన్నై సూపర్ కింగ్స్... మరో ఫ్రాంచైజీ కొనుక్కుంటేనే మైదానంలోకి!

  • సీఎస్కే తరఫున 164 మ్యాచ్ లు ఆడిన రైనా
  • మూడు సార్లు ట్రోఫీ సాధించడంలో కీలక పాత్ర
  • ఇక పసుపు రంగు జెర్సీలో చూడటం కష్టమే
  • రైనా స్థానంలోకి రుతురాజ్ గైక్వాడ్
Raina Never be Part in CSK and Ruturaj Gaikwad Pramoted

చెన్నై సూపర్ కింగ్స్ తరఫున 164 మ్యాచ్ లు, 4,527 పరుగులు. మూడు సార్లు ఆ జట్టు విజయం సాధించడంలో తనదైన పాత్ర. ధోనీ గైర్హాజరీలో మొత్తం చూసుకునే వైస్ కెప్టెన్... అతనే సురేశ్ రైనా. ఇదంతా ఇక గతమే. జట్టుతో కలిసి దుబాయ్ వెళ్లి, అక్కడ గది కోసం గొడవపడి, ఇంట్లో జరిగిన పరిణామాలను సాకుగా చూపి, వెనక్కు వచ్చేసిన రైనాతో సీఎస్కే బంధం పూర్తిగా తెగిపోయినట్టేనని, ఇక అతన్ని పసుపు రంగు జెర్సీలో చూసే అవకాశాలులేవని ఐపీఎల్ వర్గాలు అంటున్నాయి.

తొలుత చెన్నై జట్టులో కరోనా కలకలంతో పాటు, తమ బంధువు చనిపోవడంతో రైనా దుబాయ్ నుంచి వెనక్కు వస్తున్నట్టు వార్తలు వచ్చినా, ఆ మరుసటి రోజే సీఎస్కే యజమాని ఎన్ శ్రీనివాసన్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ధోనీకి కేటాయించినట్టుగా, బాల్కనీ ఉన్న గదిని తనకు ఇవ్వలేదని గొడవ పెట్టుకుని రైనా వెళ్లాడని, అతనికి విజయగర్వం తలకెక్కిందని తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీంతో రైనాకు, సీఎస్కేకు ఉన్న సంబంధం శాశ్వతంగా తెగిపోయిందని క్రికెట్ వర్గాలు అంటున్నాయి.

బయో బబుల్ నిబంధనలను అతను అతిక్రమించడంతో ధోనీ సహా ఫ్రాంచైజీ అధికారులంతా రైనాపై ఆగ్రహంతోనే ఉన్నారని, ఒకవేళ తదుపరి రైనా క్షమించాలని కోరినా, అది జరిగే అవకాశాలు లేవని, రైనాను తిరిగి దుబాయ్ పిలిచేందుకు ఎవరూ సుముఖంగా లేరని తెలుస్తోంది. వాస్తవానికి జట్టు కోచ్, కెప్టెన్, మేనేజర్ లకు మాత్రమే సూట్ రూములను ఇవ్వడం సీఎస్కేలో నిబంధనని, అయినా రైనాకు సూట్ రూమ్ నే ఇచ్చామని, దానికి బాల్కనీ లేదని ఆయన గొడవ పెట్టుకున్నాడని ఐపీఎల్ వర్గాలు అంటున్నాయి.

ఇదిలావుండగా, ఈ సీజన్ కు రైనా ఐపీఎల్ కు దూరమైనట్టే. వచ్చే సంవత్సరం ఏప్రిల్ లో తిరిగి మొదలయ్యే సీజన్ లో రైనాను మరో ఫ్రాంచైజీ కొనుగోలు చేస్తేనే అతను మైదానంలోకి దిగుతాడు. రైనా ఆటతీరును చూసి మరేదైనా టీమ్ అతన్ని కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయనే భావించాలి. ఒకసారి తమ జట్టు నుంచి వెళ్లిపోయిన వారిని సీఎస్కే తిరిగి ఆహ్వానించక పోవడంతో రైనా, మరోసారి ధోనీ పక్కన కనిపించే అవకాశాలు లేనట్టే. ఇదే సమయంలో రైనా స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ ను ప్రమోట్ చేయాలని శ్రీనివాసన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకు తగ్గట్టుగా కెప్టెన్ ధోనీతో పాటు కోచ్ ఫ్లెమింగ్ ప్లాన్లను రూపొందిస్తున్నారని సమాచారం.

More Telugu News