India: దక్షిణ చైనా సముద్రంలో భారత యుద్ధ నౌక... చైనా ఉలికిపాటు!

  • ఇటీవల చైనాతో సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం
  • చర్చలు ఫలించకుంటే ఫలితం వేరేలా ఉంటుందన్న విదేశాంగ శాఖ
  • అండమాన్ తీరాలను దాటి చైనా పరిధిలోకి వార్ షిప్
  • పరిస్థితిని సమీక్షిస్తున్నామన్న చైనా
Indian War Ship at South China Sea

ఇటీవల భారత్, చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త వాతావరణం, ఆపై మొదలైన వాణిజ్య యుద్ధం తరువాత, ఇండియా మరో కీలక అడుగు వేసింది. దక్షిణ చైనా సముద్రంలోకి తన యుద్ధ నౌకను పంపింది. చైనా అధికారులతో ఇండియా జరుపుతున్న ద్వైపాక్షిక చర్చలు ఎటూ తేలకపోవడం, చర్చలు ఫలవంతం కాకుంటే తదుపరి నిర్ణయాలు వేరేలా ఉంటాయని విదేశాంగ శాఖ స్పష్టం చేసిన నేపథ్యంలో, మన యుద్ధనౌక చైనా సముద్రంలోకి వెళ్లడం కలకలం రేపుతోంది.

జూన్ లో తూర్పు లడఖ్, గాల్వాన్ లోయలో జరిగిన పరిణామాల తరువాత భారత్ ఈ కీలక నిర్ణయం తీసుకోగా, ఇండియన్ వార్ షిప్ లు తమ పరిధిలోకి రావడాన్ని చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. 2009 తరువాత దక్షిణ చైనా సముద్రంలో కృత్రిమ ద్వీపాలను సృష్టించిన చైనా, తన సైనిక అవసరాలను అక్కడి నుంచి తీర్చుకుంటున్న సంగతి తెలిసిందే.

"గాల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల్లో 20 మంది భారత సైనికులు మరణించిన తరువాత, కేంద్రం తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా భారత నౌకాదళం, తన వార్ షిప్ ను దక్షిణ చైనా సముద్రంలోకి పంపింది. దక్షిణ చైనా సముద్రంలోని అత్యధిక భాగం తన పరిధిలోనికే వస్తుందని వాదిస్తున్న చైనా లిబరేషన్ ఆర్మీ అక్కడ మరొకరి ఉనికిని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది" అని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

కాగా, ఇప్పటికే దక్షిణ చైనా సముద్రంలో అమెరికా తన వార్ షిప్ లను మోహరించిన సంగతి తెలిసిందే. ఇక్కడ యూఎస్, ఇండియాలు కలిసి నావికా దళ విన్యాసాలను సైతం ప్రారంభించాయి. భారత వార్ షిప్, అండమాన్ నికోబార్ దీవులకు సమీపంలోని మలక్కా జలసంధి సమీపంలో మోహరించింది. ఈ సముద్ర జలాలు తమ పరిధిలోనివేనని అంటున్న ఇండియా, ఇదే ప్రాంతానికి జలాంతర్గాములను సైతం పంపాలని నిర్ణయించిందని కేంద్ర వర్గాలు వెల్లడించాయి. కాగా, భారత వార్ షిప్ సౌత్ చైనా సీ పరిధిలోకి రావడాన్ని ఖండిస్తున్నామంటూనే, పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని చైనా అధికారి ఒకరు పేర్కొన్నారు.

More Telugu News