Teacher: కరోనా కాటు... విజయవాడలో చెప్పులు అమ్ముకుంటున్న ఉపాధ్యాయుడు

  • లాక్ డౌన్ తో మూతపడిన స్కూళ్లు
  • ఉపాధి కోల్పోయిన టీచర్లు
  • పొట్టపోసుకునేందుకు పడరాని పాట్లు
Teacher sells foot wear after schools shut down due to corona pandemic

భావి పౌరులను తయారుచేసే ఉపాధ్యాయులు కరోనా మహమ్మారి ప్రభావంతో ఉపాధి కోల్పోయి రోడ్డునపడుతున్నారు. విజయవాడకు చెందిన టి.వెంకటేశ్వరరావు (43) అనే టీచర్ కొన్నాళ్లుగా స్కూళ్లు మూతపడడంతో కుటుంబ పోషణ నిమిత్తం రోడ్డుపై చెప్పులు అమ్ముకుంటున్నాడు. ఈ విషయం జాతీయ మీడియాలో వచ్చింది. విజయవాడలోని మూడు ప్రైవేటు స్కూళ్లలో వెంకటేశ్వరరావు పార్ట్ టైమ్ పద్ధతిలో టెన్త్ క్లాస్ విద్యార్థులకు గణితం బోధిస్తాడు.

అయితే కరోనా వ్యాప్తి, లాక్ డౌన్ కారణంగా స్కూళ్లు మూతపడడంతో ఈ ఉపాధ్యాయుడి ఆర్థిక పరిస్థితి క్షీణించింది. ఫుల్ టైమ్ టీచర్లకే అరకొరగా జీతాలు చెల్లిస్తున్న స్కూళ్ల యాజమాన్యాలు తమవంటి పార్ట్ టైమర్లను పట్టించుకోవడంలేదని, దాంతో చేసేది లేక పడవల రేవు సెంటర్ లో పాదరక్షలు విక్రయిస్తూ, వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషించుకుంటున్నానని వెంకటేశ్వరరావు వెల్లడించాడు.

ఈ అంశాన్ని టీడీపీ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. భావి పౌరులను తయారుచేసే గురువులు జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నారని, కూలీలుగా పనిచేస్తూ, అరటి పళ్లు అమ్ముకుంటూ నెట్టుకొస్తున్నారని వివరించింది. ఈ విపత్కర పరిస్థితుల్లో స్కూల్ టీచర్లు, లెక్చరర్లను ప్రభుత్వం ఆదుకోవాలని, ఆర్థికసాయం అందించాలని టీడీపీ డిమాండ్ చేసింది.

More Telugu News