Rain: 44 ఏళ్ల తరువాత... సాధారణంతో పోలిస్తే ఆగస్టులో 25 శాతం అధిక వర్షం

  • సాధారణంతో పోలిస్తే 25 శాతం అధిక వర్షం
  • కళకళలాడుతున్న కృష్ణా బేసిన్
  • ఇప్పటికే నిండిపోయిన అన్ని జలాశయాలు
  • 9 శాతం పెరిగిన సాగు విస్తీర్ణం
Heavy Rains in August after 44 Years

ఓ వైపు కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ, ఈ ఆగస్టులో వర్షపాతం పరంగా గడచిన 33 ఏళ్లలో ఎన్నడూ లేని అద్భుతం జరిగింది. ఈ ఆగస్టులో దేశవ్యాప్తంగా సగటు వర్షపాతం కన్నా 25.1 శాతం అధికంగా వర్షం కురిసిందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇక, తెలంగాణ విషయానికి వస్తే, ఏకంగా 89 శాతం అధిక వర్షపాతం నమోదైంది. కృష్ణా బేసిన్ లోని అన్ని ప్రాజెక్టులూ నిండిపోవడంతో, ఈ వ్యవసాయ సీజన్ లో నీటి కోసం రైతాంగం ఏ మాత్రమూ దిగులు చెందాల్సిన పరిస్థితి లేదు.

కాగా, ఈ నెలలో బంగాళాఖాతంలో 5 అల్ప పీడనాలు ఏర్పడటమే ఇంత అధికంగా వర్షం కురవడానికి కారణమని వాతవరణ శాఖ అధికారులు అంచనా వేశారు. 1973-76 మధ్య ఈ స్థాయిలో దేశంలో వర్షం కురిసింది. ఆపై ఆగస్టులోనే ఇంత భారీగా వర్షాలు రావడం, నదులు, వాగులు, వంకలు పొంగి పొర్లి, ప్రాజెక్టులన్నీ నిండటం ఇదే తొలిసారి. ఇక తెలుగు రాష్ట్రాల్లో గడచిన 80 రోజుల్లో 64 రోజుల పాటు ఎక్కడో ఒక చోట వర్షం కురుస్తూనే ఉండటం గమనార్హం.

ఇదిలావుండగా, ఈ వర్షాలకు కృష్ణా బేసిన్ పరవళ్లు తొక్కుతోంది. కృష్ణమ్మతో పాటు ఉపనదులైన తుంగభద్ర, భీమా తదితర నదులపై ఉన్న జలాశయాలన్నీ ఇప్పటికే నిండుకుండలయ్యాయి. దీంతో రిజర్వాయర్ల నుంచి వెళ్లే అన్ని కాలువలకూ పూర్తి స్థాయిలో నీటిని వదులుతున్నారు. గోదావరి బేసిన్ ఇప్పుడిప్పుడే జలకళను సంతరించుకుంటోంది. మరోవైపు రుతుపవనాల కదలిక సంతృప్తికరంగా ఉండటంతో మరింత వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇక దేశవ్యాప్తంగా పరిశీలిస్తే, జూన్ నుంచి ఆగస్టు వరకూ సాధారణంగా 696.6 మిల్లీమీటర్ల వర్షపాతం సగటు కాగా, ఈ సంవత్సరం 760.1 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. అంటే, 9 శాతం అధిక వర్షపాతం నమోదైంది. ఇందులో గడచిన 30 రోజుల వ్యవధిలోనే 25.1 శాతం అధికంగా వర్షం కురిసిందని అధికారులు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రాన్ని పరిశీలిస్తే, 574.8 మి.మీ సగటు కాగా, ఈ సంవత్సరం, 840.7 మి.మీ వర్షం కురిసింది. దీంతో రైతులు సైతం రికార్డు స్థాయిలో పంట విస్తీర్ణాన్ని పెంచారు. 2019తో పోలిస్తే సాగు విస్తీర్ణం 9 శాతం వరకూ పెరిగినట్లు అధికారులు వెల్లడించారు.

More Telugu News