K. Keshava Rao: రాజ్యసభ సభ్యుడు కేకేను మోసం చేసిన కేసు.. కీలక పాత్ర పోషించిన నిజామాబాద్ విలేకరి!

Nizamabad journalist played a key role in KK Cheating case
  • కేంద్ర ప్రభుత్వ పరిశ్రమల శాఖలో డిప్యూటీ డైరెక్టర్‌నని కేకేను నమ్మించిన విలేకరి
  • కేటీఆర్ సిఫార్సుతో నిరుద్యోగులకు రుణాలు ఇప్పిస్తానని మోసం
  • ప్రాసెసింగ్ ఫీజు కింద రూ. 1.25 లక్షలు చెల్లించాల్సి ఉంటుందన్న నిందితుడు
టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావును మోసం చేసిన కేసులో నిజామాబాద్ జిల్లాకు చెందిన విలేకరి కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తోంది. కేకేకు అతడు ఫోన్ చేసిన నంబరు ఇంకా పనిచేస్తుండడంతో పోలీసులు అతడితో మాట్లాడారని, దీంతో మోసం చేసి తీసుకున్న సొమ్మును అతడు తిరిగి బాధితుడు అఖిల్ కుమార్ ఖాతాలో జమచేశాడని తెలుస్తోంది. ఈ మోసంలో సదరు విలేకరితోపాటు మరో వ్యక్తికి కూడా ప్రమేయం ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు.

మహేశ్ పేరుతో కేకేకు ఫోన్ చేసిన విలేకరి తాను కేంద్ర ప్రభుత్వ పరిశ్రమల శాఖలో డిప్యూటీ డైరెక్టర్‌నని నమ్మించాడు. మంత్రి కేటీఆర్ సిఫార్సుతో కొంత మంది నిరుద్యోగులకు రుణాలు ఇప్పించే పథకాన్ని కల్పిస్తామని నమ్మబలికాడు. అతడి మాటలు నమ్మిన కేకే తన కుమార్తె, బంజారాహిల్స్ కార్పొరేటర్ అయిన విజయలక్ష్మికి చెప్పారు. ఆమె అనుచరుల్లో 25 మందికి రుణాలు ఇప్పించేందుకు నిందితుడు అంగీకరించాడు.

అయితే, ఒక్కొక్కరు రూ. 1.25 లక్షల ప్రాసెసింగ్ ఫీజు కట్టాల్సి ఉంటుందన్నాడు. ఇందులో అఖిల్ అనే వ్యక్తి రూ. 50 వేలు చెల్లించాడు. ఈ కేసును తీవ్రంగా పరిగణించిన బంజారాహిల్స్ పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో కీలక అంశాలను రాబట్టారు. నిజామాబాద్‌ జిల్లాకు చెందిన ఓ విలేకరి ఇందులో కీలక పాత్ర పోషించినట్టు గుర్తించారు. మరో యువకుడు కలిసి మరికొందరు ఎంపీలను కూడా ఇలాగే మోసం చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. వీరి కోసం గాలిస్తున్నారు.
K. Keshava Rao
TRS
Cheating
Crime News
Hyderabad

More Telugu News