Directro Shankar: దర్శకుడు శంకర్ కు భూమి కేటాయింపు... టీఎస్ ప్రభుత్వంపై హైకోర్టు ప్రశ్నల వర్షం

TS High Court faults land allotment to director Shankar
  • రూ. 2.5 కోట్ల భూమిని రూ. 25 లక్షలకే ఎలా కేటాయిస్తారు?
  • ప్రభుత్వమే స్టూడియోను నిర్మించవచ్చు కదా?
  • కేబినెట్ నిర్ణయాలకు సహేతుకత ఉండాలి
స్టూడియో నిర్మాణం కోసం సినీ దర్శకుడు శంకర్ కు తెలంగాణ ప్రభుత్వం భూమిని కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ కేటాయింపును సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పిటిషన్ ను విచారించిన హైకోర్టు ధర్మాసనం ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించింది. రూ. 2.5 కోట్ల విలువైన భూమిని రూ. 25 లక్షలకే ఎలా కేటాయిస్తారని ప్రశ్నించింది. ఈ ప్రశ్నకు సమాధానంగా తెలంగాణ ఉద్యమంలో శంకర్ కీలకపాత్ర పోషించారని అడ్వొకేట్ జనరల్ చెప్పారు. ఈ సమాధానం పట్ల హైకోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది. తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది త్యాగాలు చేశారని... వారందరికీ ఇలాగే భూములిస్తారా? అని ప్రశ్నించింది.

ప్రభుత్వ భూములను సినీ పరిశ్రమ ఆక్రమించడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఇప్పటికే హైదరాబాదులో అద్భుతమైన రామోజీ ఫిలింసిటీ ఉందని గుర్తు చేసింది. కావాలనుకుంటే ప్రభుత్వమే స్టూడియోను నిర్మించవచ్చు కదా? అని ప్రశ్నించింది. ఇలాంటి భూకేటాయింపుల వల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని తెలిపింది. కేబినెట్ తీసుకునే నిర్ణయాలకు సహేతుకత ఉండాలని చెప్పింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
Directro Shankar
Tollywood
TS Govt
Land Allotment
TS High Court

More Telugu News