Nikky Heley: కమలా హారిస్ కు పోటీగా.. భారత సంతతి మహిళ నిక్కీ హేలీని ప్రమోట్ చేస్తున్న ట్రంప్!

Trump Nominates Nikky Heley for Vice President Post
  • వర్చ్యువల్ విధానంలో ప్రారంభమైన రిపబ్లికన్ కన్వెన్షన్
  • ఇక 2024లో ఇద్దరు భారత మూలాలున్న మహిళల మధ్య అధ్యక్ష పోరు
  • విశ్లేషించిన యూఎస్ మీడియా
  • వలస వెళ్లిన పంజాబ్ సిక్కు కుటుంబానికి చెందిన నిక్కీ
  • గతంలో సౌత్ కరోలినాకు గవర్నర్, ఆపై యూఎస్ అంబాసిడర్
మరో రెండు నెలల్లో అధ్యక్ష ఎన్నికలను రెండోసారి ఎదుర్కోనున్న డొనాల్డ్ ట్రంప్, తమ పార్టీ భవిష్యత్తు గురించి కూడా ఆలోచించడం ప్రారంభించారు. 2024లో జరిగే అధ్యక్ష ఎన్నికలకు సౌత్ కరోలినా మాజీ గవర్నర్, యునైటెడ్ నేషన్స్ మాజీ ప్రతినిధి నిక్కీ హేలీని ప్రమోట్ చేయాలని ట్రంప్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

డెమోక్రాట్లు ఉపాధ్యక్ష పదవికి భారత సంతతి మహిళ కమలా హారిస్ ను ఎంపిక చేసి, ఆమెనే 2024 అధ్యక్ష ఎన్నికల్లో తమ తరఫున నిలపాలని భావిస్తున్న వేళ, భారత సంతతి మూలాలున్న, నిక్కీ హేలీ అయితే గట్టి పోటీ ఉంటుందని, గెలుపు అవకాశాలు కూడా ఉంటాయని రిపబ్లికన్లు భావిస్తున్నారని తెలుస్తోంది. దీంతో 2024లో అమెరికా అధ్యక్ష పదవికి ఇద్దరు భారత మూలాలున్న మహిళలు పోటీ పడేందుకు ఇప్పుడే అడుగులు పడ్డట్లయింది.

రిపబ్లికన్ల నేషనల్ కన్వెన్షన్ ప్రారంభంకాగా, ప్రస్తుతమున్న ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ నే మరోమారు అదే పదవికి ఏకగ్రీవంగా సభ నామినేట్ చేసింది. అంతకుముందు వైస్ ప్రెసిడెంట్ పోస్టుకు నిక్కీ హేలీని నామినేట్ చేయనున్నారని వార్తలు వచ్చినా, చివరకు మైక్ పెన్స్ కే మరోమారు అవకాశం ఇవ్వాలని రిపబ్లికన్ పార్టీ నిర్ణయించింది.

కాగా, ఇండియాలోని సిక్కుల మూలాలున్న నిక్కీ హేలీ, గతంలో సౌత్ కరోలినా గవర్నర్ గానూ పనిచేశారు. రెండు రోజుల క్రితం జరిగిన నేషనల్ కన్వెన్షన్ లో ఆమె ప్రసంగానికి మంచి స్పందన వచ్చింది. అధ్యక్షుడు ట్రంప్ కూడ ఆమెను మెచ్చుకున్నారు. ఈ వర్చ్యువల్ సమావేశంలో నిక్కీ మాట్లాడుతూ, "అమెరికాలో జాత్యహంకారం ఉందని చెప్పడం అవాస్తవం. నా వరకూ నన్నే తీసుకోండి. నేను ఇండియా నుంచి వచ్చిన వలసదారుల అమ్మాయినని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను. వారు అమెరికాకు వచ్చి, చిన్న పట్టణంలో స్థిరపడ్డారు. నా తండ్రి టర్బన్ ధరిస్తారు. నా తల్లి చీర కట్టుకుంటుంది. నేను నలుపు, తెలుపుల ప్రపంచంలో పుట్టాను" అని అన్నారు. తన తల్లి విజయవంతమైన వ్యాపారస్తురాలిగా నిలిచారని, తన తండ్రి చారిత్రాత్మకంగా నల్లవారి కాలేజీగా పేరున్న చోట, 30 ఏళ్లు పాఠాలు చెప్పారని గుర్తు చేసుకున్న ఆమె, తనను సౌత్ కరోలినా ప్రజలు, తొలి మైనారిటీ, తొలి మహిళగా గవర్నర్ గా ఎన్నుకుని ఘనమైన గౌరవాన్ని ఇచ్చారని అన్నారు.

ఈ సమావేశం తరువాత తదుపరి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఉత్తర, దక్షిణ భారతాలు పోటీ పడనున్నాయని పత్రికల్లో విశ్లేషణలు వచ్చాయి. కమలా హారిస్ తల్లి శ్యామలా గోపాలన్ తమిళనాడుకు చెందిన మహిళ కాగా, నిక్కీ హేలీ తల్లిదండ్రులు అజిత్ సింగ్ రాంధావా, రాజ్ కౌర్ లు అమృతసర్ కు చెందిన వారు. 2024లో లేదా 2028లో రిపబ్లికన్ల తరఫున అధ్యక్ష పదవికి నిక్కీ హేలీ బరిలోకి దిగుతారని అంచనా వేస్తున్నట్టు యూసీ రివర్ సైడ్ పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ కార్తీక్ రామకృష్ణన్ వ్యాఖ్యానించారు.
Nikky Heley
Donald Trump
Kamala Harris
US Vice President

More Telugu News