India: అంతా మన తప్పే... కరోనా కేసులు పెరుగుతున్న కారణమిదే: ఐసీఎంఆర్

  • యువత, వృద్ధుల బాధ్యతారాహిత్యం
  • అవగాహన లేక విచ్చలవిడిగా తిరిగేస్తున్నారు
  • ఐసీఎంఆర్ డైరెక్టర్ బలరామ్ భార్గవ
ICMR Director Comments on Corona Cases Hike

యువత, వృద్ధులు అన్న తేడా లేకుండా, బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్న దేశ ప్రజల వల్లే కరోనా మహమ్మారి దేశంలో విజృంభిస్తోందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) డైరెక్టర్ జనరల్ ప్రొఫెసర్ బలరామ్ భార్గవ వ్యాఖ్యానించారు.

"యువత కారణంగానో, పెద్దల కారణంగానో వైరస్ వ్యాపిస్తోందని చెప్పను. అవగాహన లేని ప్రజల వల్లే ఈ వైరస్ వ్యాపిస్తోంది. కనీసం మాస్క్ లను కూడా ధరించకుండా బయట తిరుగుతూ బాధ్యతా రహితంగా వ్యవహరించే వారితోనే సమస్య" అని ఆయన అన్నారు. వైరస్ ను నివారించేందుకు మూడు వ్యాక్సిన్ లు సిద్ధమవుతున్నాయని తెలిపిన ఆయన, సీరమ్ ఇనిస్టిట్యూట్ వ్యాక్సిన్ రెండు, మూడో దశ ప్రయోగాల్లో ఉండగా, భారత్ బయోటెక్, జైడస్ కాడిలా వైరస్ తొలి దశను విజయవంతంగా ముగించాయని తెలిపారు.

కాగా, ఇండియాలో కరోనా కేసుల సంఖ్య 31.67 లక్షలను దాటి, 58 వేల మందికి పైగా మరణించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం 7 లక్షలకు పైగా యాక్టివ్ కేసులు ఇండియాలో ఉన్నాయి. దేశంలో మహమ్మారి నుంచి రికవరీ రేటు క్రమంగా పెరుగుతూ ఉంది. ప్రస్తుతం రికవరీ రేటు 75.92 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.84 శాతంగా ఉంది. ఇదే సమయంలో రోజురోజుకూ కొత్త కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఆగస్టు 7న 20 లక్షల మార్క్ ను తాకిన కేసుల సంఖ్య, ఆపై 11 రోజుల్లోనే 30 లక్షలకు, మరో వారానికి 30 లక్షలను దాటేయడం కేసుల పెరుగుదల ఉద్ధృతిని చెప్పకనే చెబుతోంది.

More Telugu News