NEET: పేరెంట్స్ కోరుతున్నారు... మరో మార్గం లేకనే నీట్, జేఈఈ పరీక్షలు: కేంద్ర మంత్రి స్పష్టీకరణ

Preasure from Parents and Students on Education Ministry to Conduct NEET and JEE
  • ఇప్పటికే పరీక్షల తేదీలను ప్రకటించిన కేంద్రం
  • పరీక్షల కోసం మాపై ఎంతో ఒత్తిడి ఉంది
  • దూరదర్శన్ ఇంటర్వ్యూలో రమేష్ పోఖ్రియాల్
ఈ సంవత్సరం నీట్, జేఈఈ పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధపడ్డ కేంద్రం పరీక్షల తేదీలను కూడా ప్రకటించిన నేపథ్యంలో, కరోనా తగ్గుముఖం పట్టకుండానే, పరీక్షలు పెట్టడంపై విమర్శలు వస్తున్న వేళ, కేంద్ర విద్యాశాఖా మంత్రి రమేశ్ పోఖ్రియాల్ స్పందించారు. పరీక్షలు పెట్టాలని తామేమీ తొందరపడలేదని, వెంటనే వీటిని నిర్వహించాలని విద్యార్థుల తల్లిదండ్రులు, పరీక్షలకు ప్రిపేర్ అయిన వారు కోరుతున్నారని, మరో మార్గం లేకనే వీటి నిర్వహణకు అంగీకరించామని ఆయన అన్నారు. పరీక్షలు వెంటనే పెట్టాలని కొంతకాలంగా తల్లిదండ్రులు, విద్యార్థుల నుంచి ఒత్తిడి వస్తోందని ఆయన అన్నారు. 

కాగా, ఐఐటీల్లో ప్రవేశానికి జేఈఈ (జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్), మెడికల్ కోర్సుల్లో చేరేందుకు నీట్ (నేషనల్ ఎలిజబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్) నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షలు వచ్చే నెలలో జరుగనున్నాయి. తాజాగా ప్రభుత్వ అధీనంలోని దూరదర్శన్ న్యూస్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన రమేశ్ పోఖ్రియాల్, జేఈఈ పరీక్షలకు హాజరవుతున్నవారు అడ్మిట్ కార్డులను కూడా డౌన్ లోడ్ చేసుకున్నారని అన్నారు. పరీక్షలు ఆలస్యం అవుతుంటే, విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొందని వ్యాఖ్యానించిన ఆయన, మరింత కాలం వారిని వేచి చూసేలా చేయడం తగదని భావించిన తరువాతనే పరీక్షలకు పచ్చజెండా ఊపామని అన్నారు.

మొత్తం 8.58 లక్షల మంది జేఈఈ పరీక్షలకు రిజిస్టర్ చేసుకోగా, వారిలో 7.25 లక్షల మంది అడ్మిట్ కార్డులను తీసుకున్నారని, వారి క్షేమమే తమకు ముఖ్యమని, ఆ తరువాతే పరీక్షలని అన్నారు. కరోనా నేపథ్యంలో అన్ని రకాల జాగ్రత్తలూ తీసుకునే వీటిని నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. పాఠశాలలను ప్రారంభించే విషయమై స్పందిస్తూ, హోమ్ శాఖ, ఆరోగ్య శాఖ ఇచ్చే గైడ్ లైన్స్ మేరకు నిర్ణయం తీసుకుంటామని అన్నారు.

జేఈఈ, నీట్ పరీక్షలకు వచ్చే వారు మాస్క్ లు, గ్లౌజస్ ధరించడం తప్పనిసరి చేశామని, శానిటైజర్, వాటర్ తెచ్చుకోవచ్చని అన్నారు. పరీక్ష హాల్ లోకి వెళ్లేముందు థర్మల్ స్క్రీనింగ్ తప్పనిసరని, అదే సెంటర్ లో ఐసోలేషన్ రూమ్ కూడా ఉంటుందని, శరీర ఉష్ణోగ్రత అధికంగా ఉన్న వారిని ఆ గదిలో పరీక్ష రాయిస్తామని అన్నారు.
NEET
JEE
RameshPhokriyal
Exams
Parents

More Telugu News