Polio: పోలియోపై విజయం సాధించిన ఆఫ్రికా ఖండం.. ప్రకటించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

  • నాలుగేళ్లుగా నమోదు కాని పోలియో కేసు
  • ప్రభుత్వం, ఆరోగ్య కార్యకర్తలు, దాతలకు డబ్ల్యూహెచ్ఓ ప్రశంస
  • ప్రపంచవ్యాప్తంగా పోలియో నిర్మూలనలో ఇది కీలక దశ అన్న నైజీరియా వైద్యుడు
africa to be declared polio free continent

ఆఫ్రికా ఖండం మరో ఘనతను సొంతం చేసుకుంది. పోలియోను జయించిన ఖండంగా రికార్డులకెక్కింది. గత నాలుగేళ్లలో ఒక్కటంటే ఒక్క కేసు కూడా ఈ ఖండంలో నమోదు కాకపోవడంతో ఆఫ్రికాను పోలియో రహిత ఖండంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఆఫ్రికా దేశమైన ఈశాన్య నైజీరియాలో చివరిసారి నాలుగేళ్ల క్రితం ఒకే ఒక్క పోలియో కేసు నమోదైంది. ఆ తర్వాత ఇప్పటి వరకు దాని ఉనికి లేదు. పోలియోను తరిమికొట్టడంలో ప్రభుత్వం, దాతలు, ఆరోగ్యకార్యకర్తలు, కమ్యూనిటీలు చేసిన కృషి ప్రశంసనీయమని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశంసించింది. వారి కృషి ఫలితంగా 1.8 మిలియన్ మంది చిన్నారులు పోలియో నుంచి బయటపడ్డారని కొనియాడింది.

పోలియో నిర్మూలన కోసం గత 30 ఏళ్లుగా కృషి చేస్తున్నామని నైజీరియా వైద్యుడు, రోటరీ ఇంటర్నేషనల్ స్థానిక యాంటీ పోలియో కోఆర్డినేటర్ తుంజీ ఫన్‌షో అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పోలియో నిర్మూలనలో ఇది ఎంతో కీలకమైన దశ అని, తమ ఖండం నుంచి పోలియోను తరిమికొట్టినందుకు చెప్పలేనంత ఆనందంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. కాగా, ఆఫ్రికా ఖండం పోలియో రహితంగా మారినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ కలిసి అధికారికంగా ప్రకటించారు.

More Telugu News