Nizamabad District: బాలుడి అపహరణ.. కిడ్నాపర్ వద్ద దొరకని బాలుడు.. చితకబాదిన కుటుంబ సభ్యులు!

One and Half Year Boy Kidnaped in Nizamabad Dist
  • నిజామాబాద్ జిల్లాలో ఘటన
  • 17న బాలుడిని కిడ్నాప్ చేసిన యువకుడు
  • అతన్నుంచి బాలుడిని ఎత్తుకెళ్లిన మరో బ్యాచ్
తమ బిడ్డను ఎత్తుకెళ్లిన వ్యక్తి కోసం చుట్టుపక్కల ఊళ్లన్నీ వెతికారు. చివరకు అతను కనిపించగా, నిలదీశారు. బిడ్డ తన వద్ద లేడని చెప్పడంతో తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయి, చెట్టుకు కట్టేసి చితక బాదారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా, నవీపేట మండలం దండిగుట్టలో జరిగింది.

పోలీసులు వెల్లడించిన సమాచారం ప్రకారం, గ్రామానికి చెందిన లక్ష్మి అనే మహిళ తన పిల్లాడితో కలిసి, 17వ తేదీన బస్టాండ్ లో వేచి చూస్తుండగా, బాసర ప్రాంతానికి చెందిన నాగరాజు అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. లక్ష్మితో మాటలు కలిపిన నాగరాజు, ఆమెను నమ్మించి, ఆమె వద్దనున్న ఏడాదిన్నర బాబును తీసుకుని ఉడాయించాడు.

తన బిడ్డ కోసం బంధుమిత్రులతో కలిసి ఆమె సమీప ప్రాంతాలన్నీ వెతికింది. 15 రోజుల తరువాత నాగరాజు, నిజామాబాద్ మునిసిపల్ కార్యాలయం వద్ద కనిపించాడు. వెంటనే అతన్ని పట్టుకుని తమ బాబు ఎక్కడో చెప్పాలంటూ నిలదీశారు. బాబు తన వద్ద లేడని, తాను తీసుకుని వెళుతుంటే, మరెవరో ఎత్తుకెళ్లారని చెప్పడంతో వారిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది.

నాగరాజును చెట్టుకు కట్టేసి చావబాదిన వారు, ఆపై పోలీసులకు సమాచారం ఇచ్చి అతన్ని అప్పగించారు. కేసును రిజిస్టర్ చేసుకున్న పోలీసులు, బిడ్డ ఆచూకీ కోసం విచారిస్తున్నారు. ఇంతవరకూ బిడ్డ ఆచూకీ తెలియలేదని, తాము అన్ని రకాలుగా దర్యాఫ్తు చేస్తున్నామని అధికారులు తెలిపారు. 
Nizamabad District
Kidnap
Boy
Police

More Telugu News