APSRTC: బస్సులు ఎప్పటికో... నిర్ణయం తీసుకోకుండానే ముగిసిన ఏపీ, టీఎస్ ఆర్టీసీ భేటీ!

  • నిన్న బస్ భవన్ లో ఏపీ, టీఎస్ మధ్య చర్చలు
  • ఏకాభిప్రాయానికి రాలేకపోయిన అధికారులు
  • ఇంటర్ స్టేట్ ఒప్పందం కోసం టీఎస్ పట్టు
No Desission As off Now Over Inter State Buses Between TS and AP

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య బస్సులు తిరుగుతాయని, కావాల్సిన ప్రాంతానికి వెళ్లి రావచ్చని ఆశించిన తెలుగు ప్రజల ఆశలు, ప్రస్తుతానికి ఫలించనట్టే. నిన్న హైదరాబాద్ బస్ భవన్ లో జరిగిన ఏపీఎస్ ఆర్టీసీ, టీఎస్ ఆర్టీసీ ఉన్నతాధికారుల మధ్య జరిగిన చర్చలు ఎటువంటి తుది నిర్ణయం తీసుకోకుండానే ముగిశాయి.

ఏ రాష్ట్రం నుంచి ఎన్ని బస్సులు తిప్పాలన్న విషయమై రెండు రాష్ట్రాల అధికారుల మధ్య ఏకాభిప్రాయం రాలేదని తెలుస్తోంది. తమ రాష్ట్రం నుంచి 256 బస్సులను తిప్పుతామని ఏపీ అధికారులు ప్రతిపాదించగా, తమ రాష్ట్రంలో 1.10 లక్షల కిలోమీటర్ల పరిధిలో ఏపీ బస్సులు తిరుగుతున్నాయని, తాము కూడా ఏపీలో అదే పరిధిలో బస్సులను తిప్పాలని టీఎస్ అధికారులు చెప్పారు. సమానమైన సంఖ్యలో బస్సులను తిప్పాలని, సమానమైన కిలోమీటర్ల పరిధిలోనే అవి ప్రయాణించాలని, ఇందుకోసం ఇంటర్ స్టేట్ అగ్రిమెంట్ ను కుదుర్చుకుందామని టీఎస్ అధికారులు ప్రతిపాదించగా, ఈ విషయంలో తాము ప్రభుత్వంతో సంప్రదించి, నిర్ణయం చెబుతామని ఏపీ అధికారులు చెప్పినట్టు తెలుస్తోంది.

వాస్తవానికి, ఏపీలో ఉన్న ప్రతి ఆర్టీసీ డిపో నుంచి తెలంగాణకు, అందునా హైదరాబాద్ కు బస్సులున్నాయి. ఇవన్నీ కూడా దాదాపు 90 శాతం ఆక్యుపెన్సీతో తిరిగేవే. పండగల వేళ, అన్ని డిపోల నుంచి తెలంగాణకు అదనపు బస్సులు కూడా ఉండేవి. ఇదంతా ఉమ్మడి ఏపీ ఉన్నప్పుడు, ఆపై రాష్ట్రం విడిపోయిన వేళ కూడా ఇదే స్థితి. కరోనా తరువాత పరిస్థితులు మారిపోయాయని, ఇప్పుడు గతంలో ఉన్న పరిస్థితి లేదని, రెండు రాష్ట్రాలూ ఒప్పందం కుదుర్చుకుని, సమాన సంఖ్యలో బస్సులను నడిపించాలని టీఎస్ అధికారులు తేల్చి చెప్పడంతో సోమవారం జరిగిన చర్చల్లో ప్రతిష్ఠంభన ఏర్పడింది.

ఈ విషయంలో మరో వారంలో ఇంకోసారి సమావేశమై చర్చిద్దామన్న నిర్ణయం మినహా మరే ఇతర నిర్ణయాలనూ అధికారులు తీసుకోకుండానే చర్చలు ముగిశాయి. ఇంకో వారంలో జరిగే చర్చల్లోనయినా ప్రతిష్ఠంభన తొలగి, బస్సులు తిరుగుతాయేమో చూడాలి!

More Telugu News