Chethana Foundation: అమెరికాలో 'చేతన'.. సామాజిక సేవలో మన తెలుగువారి ఫౌండేషన్!

  • తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికాలో సేవలందిస్తున్న చేతన ఫౌండేషన్
  • పలు కార్యక్రమాలతో అభాగ్యులకు అండగా చేతన
  • బీవర్టన్ కౌంటీలో మన ఇండిపెండెన్స్ డే సందర్భంగా వేడుకలు
Chethana Foundation conducted fund raise program for orphanage in Bivertan County in Washington

మన దేశం ప్రపంచ అగ్రదేశాలతో ఎన్నో రంగాలలో పోటీపడుతోంది. ఈ అభివృద్ధిలో మన తెలుగువారి ఘనత ఎంతో ఉంది. జీవితంలో తాము ఎదుగుతూ, సమాజ శ్రేయస్సు కోసం పాటుపడుతున్న తెలుగువారు ఎందరో ఉన్నారు. మన తెలుగువారు స్థాపించిన ఎన్నో సంస్థలు మన దేశంలోనే కాకుండా ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటూ, ఎందరో అపన్నులకు అండగా నిలుస్తున్నాయి. అలాంటి సంస్థల్లో తొలి వరుసలో ఉండే వాటిలో చేతన ఫౌండేషన్ ఒకటి. ఇప్పటికే ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపిన చేతన ఫౌండేషన్... మన 74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా... పలు కార్యక్రమాలను చేపట్టింది.

మన రాష్ట్రంలో సమాజాన్ని చైతన్య పరిచిన కళాకారులను ఇటీవలే సగౌరవంగా సత్కరించిన చేతన ఫౌండేషన్... అమెరికాలో సైతం మన ఇండిపెండెన్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించింది. వాషింగ్టన్ కౌంటీలో ఉన్న బీవర్టన్ లో వివిధ కార్యక్రమాలను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో అక్కడ ఉన్న మన వారితో పాటు స్థానిక అమెరికన్లు సైతం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆహూతులు తమ వంట, రంగోలి మరియు ఆర్ట్ వీడియోలను ప్రదర్శించారు.

ఈ కార్యక్రమం సందర్భంగా పిల్లలు దేశభక్తి పాటలతో అలరించారు. ఈ కార్యక్రమానికి బీవర్టన్ మేయర్ డేనీ డోయల్ గౌరవ అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చేతన ఫౌండేషన్ తో, దాని కార్యకలాపాలతో తనకు కూడా సంబంధం ఉందని... ఇది ఎంతో సంతోషకరమైన విషయమని చెప్పారు. సమాజ శ్రేయస్సు కోసం చేతన ఫౌండేషన్ ఎంతో వైవిధ్యభరితంగా ముందుకు వెళుతోందని కితాబిచ్చారు. చేతన వాలంటీర్లతో కలిసి ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం తనకు ఎంతో తృప్తిని కలిగిస్తోందని చెప్పారు. సమాజంలో సానుకూల మార్పు కోసం తపిస్తున్న చేతన ఫౌండేషన్ కు సహాయపడటానికి ఎలాంటి సాయం అందించడానికైనా తాను సిద్థంగా ఉన్నానని తెలిపారు. చేతన కార్యక్రమాల్లో భాగస్వామి కావడం తనకు సంతోషంగా ఉందని చెప్పారు.

మరోవైపు, యూఎస్ భారతీయ అనాధాశ్రమాలకు మద్దతుగా వర్చువల్ ఫండ్ సేకరణ కార్యక్రమాన్ని చేతన ఫౌండేషన్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి అక్కడి ప్రజల నుంచి పెద్ద ఎత్తున ప్రతిస్పందన రావడం గమనార్హం.

More Telugu News