Hyderabad: 143 మంది లైంగికంగా వేధించారంటూ యువతి ఫిర్యాదు... 42 పేజీల ఎఫ్ఐఆర్ సిద్ధం చేసిన పంజాగుట్ట పోలీసులు!

  • ఎన్నో ఏళ్లుగా అత్యాచారానికి గురవుతున్నాను
  • రాజకీయ ప్రముఖులు, మీడియా, విద్యార్థి సంఘాల నేతలున్నారు
  • సినీ ప్రముఖులు కూడా లైంగికంగా వేధించారని ఫిర్యాదు
  • 41 పేజీల్లో వారందరి వివరాలు నమోదు చేసిన పోలీసులు
Women Complained on 143 People that Raped her

ఒకరు కాదు, ఇద్దరు కాదు... ఏకంగా 143 మంది తనను లైంగికంగా వేధించారంటూ, 25 ఏళ్ల యువతి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయడం తీవ్ర కలకలాన్ని రేపింది. ఈ ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు 42 పేజీల ఎఫ్ఐఆర్ ను సిద్ధం చేశారు. ఇందులో 41 పేజీల్లో 143 మంది పేర్లు, వారి వివరాలు ఉన్నాయని తెలుస్తోంది. ఎన్నో ఏళ్లుగా తనపై అత్యాచారాలు జరుగుతున్నాయని యువతి చెప్పగా, ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం తరలించారు. త్వరలోనే ఈ జాబితాలో ఉన్న అందరికీ వ్యక్తిగతంగా ఫోన్ చేసి విచారిస్తామని పోలీసులు తెలిపారు.

కాగా, తనపై అత్యాచారానికి పాల్పడిన వారిలో రాజకీయ పలుకుబడి ఉన్నవారి నుంచి, విద్యార్థి సంఘాల నేతలు, మీడియా వారు, సినిమా పరిశ్రమకు చెందిన వారు ఉన్నారని చెబుతూ, వారందరి పేర్ల జాబితాను ఆమె పోలీసులకు అందించింది. తన భర్త నుంచి విడాకులు తీసుకుని ప్రస్తుతం ఆయనకు దూరంగా ఉంటున్నానని, విడాకులు తీసుకోవడానికి ముందు భర్త తరఫు బంధువులు కొందరు తనను లైంగిక వేధింపులకు గురి చేశారని పేర్కొంది.

ఎన్నో ఏళ్లుగా తనపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని, పోలీసులకు ఆశ్రయించడం ఇదే తొలిసారని పేర్కొంది. ఆమె ఫిర్యాదును తీసుకున్న పోలీసులు ఐపీసీలోని అత్యాచారం, మహిళపై వేధింపులు తదితర సెక్షన్లతో పాటు ఎస్సీ అండ్ ఎస్టీ చట్టం కింద కూడా కేసు రిజిస్టర్ చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బాధితురాలు ఎవరన్న విషయాన్ని మాత్రం పోలీసులు వెల్లడించలేదు.

More Telugu News