COVAXIN: చర్మం కింది పొరకు టీకా... భారత్ బయోటెక్ వ్యాక్సిన్ కు కేంద్రం మరో కీలక అనుమతి!

Bharat Biotech Testing Covaxin through Intradermal Route
  • ఇంట్రా డెర్మల్ విధానంలో టీకా పరిశీలన
  • రెండు షరతులతో అనుమతి!
  • విజయవంతమైతే ధర గణనీయంగా తగ్గుతుందన్న నిపుణులు
కరోనా మహమ్మారిని అడ్డుకునేలా భారత్ బయోటెక్ తయారు చేసిన 'కోవాగ్జిన్' వ్యాక్సిన్ ను చర్మం కింది పొరలోకి ఇంజక్ట్ చేయడం ద్వారా ట్రయల్స్ చేపట్టాలని నిర్ణయించింది. ఇందుకోసం వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ప్రొటోకాల్ నిబంధనలను సడలించాల్సివుంటుంది. ఇందుకోసం డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా వీజీ సోమాని నుంచి తుది అనుమతుల కోసం సంస్థ చూస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న ట్రయల్స్ తో సంబంధం లేకుండా విడిగా ఈ విధానంలో టీకా పనితీరును పరిశీలించాలన్నది సంస్థ అభిమతం.

ఏదైనా టీకాను పలు మార్గాల ద్వారా శరీరంలోకి పంపుతారు. ఎక్కువగా భుజాలు, పిరుదు కండరాల ద్వారా వేసే టీకాలను ఇంట్రామస్కులర్ రూట్ అంటారు. మరో విధానం పేరే ఇంట్రాడెర్మల్ రూట్. దీనిలో భాగంగా చర్మం కింది పొరకు టీకాను ఇస్తారు. ఈ విధానంలో టీకాను ఇస్తే, చాలా స్వల్ప మోతాదు సరిపోతుంది. ఫలితంగా మరింత మందికి టీకాను ఇవ్వడంతో పాటు, ధర కూడా తగ్గుతుంది. ఉదాహరణకు యాంటీ రేబీస్ వ్యాక్సిన్ ను తీసుకుంటే, కండరాలకు ఇచ్చే వ్యాక్సిన్ తో పోలిస్తే, చర్మం ద్వారా ఇస్తే, 80 శాతం తక్కువ డోస్ సరిపోతుంది. దీనివల్ల ఒక ఇంజక్షన్ డోస్, నలుగురి నుంచి ఐదుగురికి ఇవ్వచ్చు. తద్వారా దాని రేటు కూడా 70 నుంచి 80 శాతం వరకూ తగ్గుతుంది.

కాగా, చర్మం ద్వారా టీకాను వేసేందుకు రెండు నిబంధనలను విధించినట్టు తెలుస్తోంది. పరీక్షల్లో పాల్గొన్న వారిని ఆరు నెలల పాటు పరిశీలనలో ఉంచాలని, వారిలో యాంటీ బాడీల పెరుగుదలను, పనితీరును పరిశీలించాలని, ప్రస్తుతం ట్రయల్స్ జరుపుతున్న చోట కాకుండా వేరే ప్రాంతాలను ఎంచుకోవాలని, ట్రయల్స్ అధ్యయన ఫలితాలను విడిగా సమర్పించాలని సూచించినట్టు సమాచారం. కోవాగ్జిన్ ను భారత్ బయోటెక్, ఐసీఎంఆర్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సంయుక్తంగా తయారు చేసిన సంగతి తెలిసిందే.

ఇప్పటివరకూ ఈ వ్యాక్సిన్ ను ఫేస్ 1, 2 ట్రయల్స్ లో భాగంగా, దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 12 ఆసుపత్రుల్లో 1,125 మందికి ఇచ్చి పరిశీలిస్తున్నారు. న్యూఢిల్లీ, పట్నాలోని ఎయిమ్స్, విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ హాస్పిటల్, హైదరాబాద్ లోని నిమ్స్, రోహ్ తక్ లో పీజీఐఎంఎస్ తదితర చోట్ల టెస్టింగ్ జరుగుతోంది.
COVAXIN
Intradermal
Bharat Biotech
Vaccine

More Telugu News