Pakistan: ఎఫ్ఏటీఎఫ్ ఆంక్షల భయంతో దావూద్ ఇబ్రహీం సహా కరుడుగట్టిన ఉగ్రవాదులపై ఆంక్షలు విధించిన పాక్

Pakistan conveys financial sanctions on terror outfit key figures
  • ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవాలన్న ఎఫ్ఏటీఎఫ్
  • లేకపోతే బ్లాక్ లిస్టులో చేర్చుతామని హెచ్చరిక
  • ముందే జాగ్రత్త పడిన పాక్
  • ఆగస్టు 18న ఆంక్షల నోటిఫికేషన్ జారీ
కరుడుగట్టిన ఉగ్రవాదులు, నేరస్తుల ఆర్థిక కార్యకలాపాలపై ఆంక్షలు విధించకపోతే అంతర్జాతీయంగా అందుతున్న ఆర్థిక సాయాన్ని నిలిపివేసేలా బ్లాక్ లిస్టులో చేర్చుతామంటూ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) చేసిన హెచ్చరిక పాకిస్థాన్ పై బాగానే పనిచేసింది. ఎఫ్ఏటీఎఫ్ తనను బ్లాక్ లిస్టులో చేర్చకముందే పాక్ జాగ్రత్త పడింది. ఈ క్రమంలో ఉగ్రవాద నేతలు హఫీజ్ సయీద్, మసూద్ అజహర్ లతో సహా మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం, అతడి అనుచరుల ఆర్థిక కార్యకలాపాలపై కఠిన చర్యలకు ఉపక్రమించింది. వారి ఆస్తుల జప్తుకు, బ్యాంక్ అకౌంట్ల నిలిపివేతకు ఆదేశాలు జారీ చేసింది.  

పాక్ ఆంక్షలు విధించిన వారిలో తాలిబాన్, దాయిష్, హక్కానీ నెట్వర్క్, అల్ ఖైదా ఉగ్రవాద ప్రముఖులు కూడా ఉన్నారు. ఈ ఆంక్షలు అన్ని స్థిర, చరాస్తులకు వర్తిస్తాయని తెలుస్తోంది. పాక్ కఠిన ఆంక్షలు విధించిన నేపథ్యంలో, ఉగ్రవాద సంస్థలు విదేశాలకు నగదు బదిలీ చేసి పెద్ద ఎత్తున ఆయుధాలు సమకూర్చుకునేందుకు ఇకపై వీలుపడదని భావిస్తున్నారు.

పారిస్ వేదికగా పనిచేసే ఎఫ్ఏటీఎఫ్ పాకిస్థాన్ ను 2018లో గ్రే లిస్టులో చేర్చింది. ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోకపోతే బ్లాక్ లిస్టులో చేర్చుతామంటూ స్పష్టం చేసింది. అందుకు 2019 డిసెంబరును గడువుగా విధించింది. అయితే కరోనా కారణంగా ఆ డెడ్ లైన్ ను మరికాస్త పొడిగించింది. ఈ క్రమంలో పాకిస్థాన్ ఆగస్టు 18న ప్రత్యేక నోటిఫికేషన్ ద్వారా ఉగ్రవాదులపై కఠిన ఆంక్షలు విధించింది.
Pakistan
Dawood Ibrahim
Hafeez Saeed
Masood Azhar
FATF

More Telugu News