Meteor: రాయల్ ఎన్ ఫీల్డ్ నుంచి కొత్త బండి.. మెటియోర్!

  • థండర్ బర్డ్ ను పోలివున్న మెటియోర్
  • రాయల్ ఎన్ ఫీల్డ్ పోర్ట్ ఫోలియోలో మరో రెట్రో లుకింగ్ బైక్
  • ఆధునిక సౌకర్యాలతో మెటియోర్
Royal Enfield ready to launch Meteor

రాజసానికి, ఠీవీకి మారుపేరుగా నిలిచే బుల్లెట్ మోటార్ సైకిల్ తయారీదారు రాయల్ ఎన్ ఫీల్డ్ భారత మార్కెట్లోకి మరో బండి తీసుకువస్తోంది. దీనిపేరు మెటియోర్. ఇది రాయల్ ఎన్ ఫీల్డ్ సంస్థ గతంలో తీసుకువచ్చిన థండర్ బర్డ్ ఎక్స్ సిరీస్ మోడల్ ను పోలి ఉంటుంది. ఈ రెట్రో బైక్ ప్రధానంగా 350 సీసీ విభాగంలో వస్తోంది. సెమీ స్కౌట్ బాబర్ స్టయిల్లో ఉన్న మెటియోర్ అటు క్లాసిక్ లుక్ మిస్ కాకుండా, ఇటు ఆధునికత కోల్పోకుండా ఓ సమతుల్యతతో కూడిన డిజైన్ అని చెప్పాలి.

దీంట్లో ఎయిర్ కూల్డ్ సింగిల్ సిలెండర్ ఇంజిన్ ఉంటుంది. ఇప్పటివరకు ఉన్న రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ ల నుంచి మనం ఆశించలేని మైలేజీని ఈ మెటియోర్ అందించే అవకాశాలున్నాయని మార్కెట్ నిపుణుల అంచనా. సంప్రదాయ టాపెట్ వాల్వ్ యూసీఈ ఇంజిన్ ను బీఎస్-6 ప్రమాణాలకు అనుగుణంగా ఆధునికీకరించడమే అందుకు కారణం. దీంట్లో 5 స్పీడ్ గేర్ బాక్స్ అమర్చారు. అల్లాయ్ వీల్ డిజైన్ తో వస్తోంది.

ఇక ఇందులో హెవీ ఫ్యూయల్ ట్యాంక్, రౌండ్ హెడ్ లైట్ మాత్రమే కాదు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మోడ్రన్ కన్సోల్ గురించి. దీన్ని సింగిల్ పాడ్ సెమీ డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ అని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించిన డిస్ ప్లేలో ఓడీఓ మీటర్, ఫ్యూయల్ గేజ్ మీటర్, ట్రిప్ మీటర్, గేర్ ఇండికేటర్, యావరేజ్ స్పీడ్, డిస్టెన్స్ టు ఎంప్టీ తదితర వివరాలు తెలుసుకోవచ్చు. వేగాన్ని డిజిటల్ రూపంలోనూ, అనలాగ్ పద్ధతిలో మీటర్ ద్వారానూ తెలుసుకోవచ్చు. మరో ఆసక్తికర అంశం ఏమిటంటే... ఈ డిజిటల్ క్లస్టర్ ను బ్లూటూత్ కు అనుసంధానం చేసుకునే వీలు కూడా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. దీనిపై కంపెనీ వెల్లడించాల్సి ఉంది.

మొత్తమ్మీద యూత్ ను ఆకట్టుకునేలా డిజైన్ చేసిన ఈ మెటియోర్ ఎప్పుడో మార్కెట్లోకి రావాల్సి ఉన్నా, దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో వాయిదా పడింది. త్వరలోనే దీన్ని మార్కెట్లో లాంచ్ చేసేందుకు రాయల్ ఎన్ ఫీల్డ్ సన్నాహాలు చేస్తోంది.

More Telugu News