కరోనా చికిత్సలో వేపమందు.. 250 మందిపై పరీక్షలు!

20-08-2020 Thu 10:02
  • నిసార్గ్ హెర్బ్స్‌తో చేతులు కలిపిన ఏఐఐఏ
  • 250 మంది రోగులపై పరిశోధన
  • యాంటీవైరల్ డ్రగ్‌గా పనిచేస్తుందని ఆశాభావం
Neem Herb In Corona Virus Treatment
కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు ప్రపంచవ్యాప్తంగా విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే కొన్ని ఔషధాలు క్లినికల్ ట్రయల్స్‌కు సిద్ధం కాగా, మరికొన్ని తుది పరీక్షల్లో ఉన్నాయి. మరోవైపు, కరోనాను తరిమికొట్టేందుకు ఆయుర్వేద వైద్యంపైనా పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఔషధ గుణాలు మెండుగా ఉండే వేపను కరోనా చికిత్సలో ఉపయోగించి ఫలితం రాబట్టేందుకు ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద (ఏఐఐఏ).. నిసార్గా హెర్బ్స్ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది.

ఈ రెండు సంస్థలు కలిసి హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఉన్న ఈఎస్ఐసీ ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహిస్తున్నాయి. మొత్తం 250 మంది కరోనా రోగులపై వేప ఔషధాన్ని పరీక్షిస్తున్నారు. తొలుత 125 మందికి వేప గుళికలు ఇచ్చినట్టు ఈ పరిశోధనకు నేతృత్వం వహిస్తున్న ఈఎస్ఐసీ డీన్ డాక్టర్ అసీం సేన్ తెలిపారు. మొత్తం 28 రోజులపాటు కొనసాగనున్న ఈ ప్రక్రియలో కరోనాపై పోరులో వేపమందు ఏమేరకు ప్రభావాన్ని చూపిస్తోందన్న విషయాన్ని డాక్టర్ అసీంసేన్ బృందం తెలుసుకోనుంది. వైరస్‌ను తరిమికొట్టడంలో వేపమందు యాంటీవైరల్ డ్రగ్‌గా నిలుస్తుందన్న నమ్మకం ఉందని నిసార్గా బయోటెక్ వ్యవస్థాపకుడు, సీఈవో గిరీశ్ సోమన్ ఆశాభావం వ్యక్తం చేశారు.