Chiranjeevi: నా అన్నయ్యకు ఏమీ కాదు... కచ్చితంగా వచ్చేస్తారు: బాలూ పరిస్థితిని తలచుకుని చిరంజీవి భావోద్వేగం!

  • ప్రస్తుతం వెంటిలేటర్ పై బాలూకు చికిత్స
  • తిరిగి వచ్చి గళం విప్పాలి
  • నిత్యమూ సుధాకర్, శైలజలతో మాట్లాడుతున్నా
  • సోషల్ మీడియాలో చిరంజీవి వీడియో మెసేజ్
Chiranjeevi Emotional Video over SPB Situation

కరోనా మహమ్మారి సోకి ప్రస్తుతం వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న ప్రఖ్యాత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం త్వరగా కోలుకోవాలని మెగాస్టార్ చిరంజీవి అభిలషించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. ఎస్పీబీ తనకు అన్నయ్య వంటివారని, ఆయనకు ఏమీ కాదని చెప్పారు.

కోటానుకోట్ల మంది అభిమాన గాయకుడు, దేశం గర్వించే అత్యుత్తమ కళాకారుడు, నా సోదర సమానుడు అయిన ఎస్పీ బాలు రోజురోజుకూ కోలుకుంటున్నారని, వైద్యానికి మెరుగ్గా స్పందిస్తున్నారని తెలిసి సంతోషిస్తున్నాను. ఆ సంతోషాన్ని మీతో పంచుకోవాలనే మీ ముందుకు వచ్చాను. బాలూతో నాకు సినిమా పరమైన అనుబంధమే కాదు...  కుటుంబపరంగా కూడా ఎంతో సాన్నిహిత్యం ఉంది. చెన్నైలో పక్కపక్క వీధుల్లో ఉంటూ తరచూ కలుసుకుంటుండే వాళ్లం. ఎన్నో సంవత్సరాల వ్యక్తిగత అనుబంధం మాది.

తనని నేను అన్నయ్యా అంటూ ఆప్యాయంగా పిలుస్తూ ఉంటాను. అలాగే తన చెల్లెళ్లు వసంత, శైలజ కూడా నన్ను అన్నయ్యా అంటూ అలాగే పిలుస్తుంటారు. గత మూడు రోజులుగా వసంత, శైలజ, శుభలేఖ సుధాకర్ లతో మాట్లాడుతూ, బాలు ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటూనే ఉన్నాను. ఈ రోజు కూడా తన ఆరోగ్యం గురించి వాళ్లతో మాట్లాడాను. బాలూ ఆరోగ్యం మెరుగు పడుతోందని వారు చెప్పిన మాటలు నాకెంతో తృప్తినిచ్చాయి. రోజురోజుకూ ఆరోగ్యం మెరుగవుతోందన్న మాటలు నాకెంతో సంతోషాన్ని ఇచ్చాయి. బాలూ తెలుగు సినిమాకు అమృత గానం. ఆ మాటకు వస్తే, భారతీయ సినిమా గానానికే ఆయన ఊపిరి రాగం, తానం, పల్లవి.

త్వరగా కోలుకుని, ఆ గళం విప్పాలని, కోటి రాగాలను తీయాలని, భారతీయులందరినీ ఉర్రూతలూగించాలని, అలరించాలని, ఆయనకున్న కోట్లాది మంది అభిమానులతో పాటు నేనూ ఆ భగవంతుడిని వేడుకుంటున్నాను. అందరి ప్రార్థనలు, ఆ దేవుడి ఆశీస్సులు ఆయన త్వరగా కోలుకునేలా చేస్తాయని, త్వరగా బాలూ మన ముందుకు వచ్చేలా చేస్తాయని, ఆయన మునుపటికంటే మరింత ఉత్సాహంతో మనల్ని అలరించాలని, ఆహ్లాద పరచాలని మనస్ఫూర్తిగా కోలుకుంటున్నాను. ఆయన కోసం మనమందరమూ కలిసి భగవంతుడిని వేడుకుందాం" అని చిరంజీవి భావోద్వేగంగా తన మనసులోని అభిప్రాయాన్ని చెప్పారు.

More Telugu News