Telangana: కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి కన్నుమూత

Kalwakurthy former MLA Yedma Kistareddy Passes away
  • గత కొంతకాలంగా కేన్సర్‌తో బాధపడుతున్న కిష్టారెడ్డి
  • 1967లో సోషలిస్ట్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి
  • కల్వకుర్తి నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక
తెలంగాణకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి కన్నుమూశారు. ఆయన వయసు 75 సంవత్సరాలు. గత కొంతకాలంగా కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న తుదిశ్వాస విడిచారు. ‘కరెంట్ కిష్టారెడ్డి’గా చిరపరిచితుడైన ఆయన 1967లో సోషలిస్టు పార్టీ ద్వారా రాజకీయాల్లో అడుగుపెట్టారు. 1973, 1981లలో కల్వకుర్తి సర్పంచ్‌గా, 1987లో మండలాధ్యక్షుడిగా, 1994లో కల్వకుర్తి ఎమ్మెల్యేగా పనిచేశారు. 2004లో కాంగ్రెస్ టికెట్‌పై మరోమారు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత టీడీపీలో చేరిన కిష్టారెడ్డి, 2014లో వైసీపీలో చేరి కల్వకుర్తి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా, రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు.

ఎడ్మ కిష్టారెడ్డి మృతికి ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి,  స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, హరీశ్‌రావు, నిరంజన్‌రెడ్డితోపాటు టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, జానారెడ్డి, పొన్నం ప్రభాకర్, పొన్నాల లక్ష్మయ్య, సంపత్‌ కుమార్, చల్లా వంశీచంద్‌రెడ్డి, మల్లు రవి తదితరులు నివాళులర్పించారు. కాగా, కిష్టారెడ్డి అంత్యక్రియలు నిన్ననే ముగిశాయి.
Telangana
Yedma kistareddy
TRS
YSRCP
Passes away

More Telugu News