Chandrababu: గోదావరి వరదలపై సీఎం జగన్ కు లేఖ రాసిన చంద్రబాబు

  • గోదారి ఉగ్రరూంతో ఉభయ గోదావరి జిల్లాలు విలవిల
  • కరోనాకు తోడు మరో ఉపద్రవం వచ్చిందన్న బాబు
  • బాధితుల్లో భరోసా నింపాలంటూ లేఖ
Chandrababu writes CM Jagan on Godavari floods

గత మూడ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి వరద ఉద్ధృతి పెరిగిందని, వాగులు సైతం పొంగిపొర్లుతున్నాయని, ఉభయ గోదావరి జిల్లాల పరిస్థితి అస్తవ్యస్తంగా మారిందని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. ప్రజలను, రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఈ మేరకు ఆయన సీఎం జగన్ కు లేఖ రాశారు.

ఓవైపు కరోనాతో అల్లాడుతున్న ప్రజలకు ఈ వరద ముంపు మరింత తీవ్ర ఉపద్రవంలా పరిణమించిందని అభిప్రాయపడ్డారు. గంటగంటకు పెరుగుతున్న వరద ఉద్ధృతితో ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొందని, 65 గ్రామాల్లో 1,460 హెక్టార్లలో వరిపంట, మరో 22 గ్రామాల్లో 225 హెక్టార్లలో పత్తి, 282 హెక్టార్లలో ఉద్యాన పంటలు నీట మునిగినట్టు తెలుస్తోందని తన లేఖలో వివరించారు.

ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన స్పందించి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని, ముంపు గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని చంద్రబాబు కోరారు. పునరావాస కేంద్రాల్లో అన్ని వసతులు ఉండేలా చూడాలని, ముఖ్యంగా అంటువ్యాధులు ప్రబలకుండా అన్ని చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుని రైతుల్లోనూ, ముంపు బాధితుల్లోనూ భరోసా నింపాలని విజ్ఞప్తి చేశారు.

More Telugu News