Godavari: భద్రాచలం వద్ద మూడో హెచ్చరిక దాటి ప్రమాదకరంగా ప్రవహిస్తున్న గోదావరి

  • పొంగిపొర్లుతున్న గోదావరి
  • భద్రాచలం వద్ద ప్రస్తుతం 61 అడుగులకు చేరిన నీటిమట్టం
  • ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్న అధికారులు
Godavari water level reaches dangerous mark at Bhadrachalam

గత కొన్నిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నది పోటెత్తుతోంది. భద్రాచలం వద్ద మూడో హెచ్చరిక దాటి ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 61 అడుగులకు చేరింది. 2014 తర్వాత గోదావరికి ఈ స్థాయిలో వరద నీరు రావడం ఇదే ప్రథమం అని అధికారులు చెబుతున్నారు. కాగా, ఇప్పటికీ పరీవాహక ప్రాంతాల నుంచి వరద నీరు వచ్చి చేరుతుండడంతో ఈ రాత్రికి గోదావరి నీటిమట్టం భద్రాచలం వద్ద 63 అడుగులకు చేరుతుందని అంచనా వేస్తున్నారు.

నీటిమట్టం పెరుగుతోందని లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కేంద్ర జలమండలి కూడా హెచ్చరికలు చేస్తోంది. భద్రాచలం ఏజెన్సీ ఏరియాతో పాటు పినపాక నియోజకవర్గంలో వరద తీవ్రత ఉంటుందని భావిస్తున్నారు. ఈ క్రమంలో ముంపు మండలాల్లో అధికారులు అప్రమత్తం అయ్యారు. చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. వరద కారణంగా వేల ఎకరాల్లో పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. నీటిమట్టం పెరుగుతుండడంతో ఖమ్మం నుంచి భద్రాచలం వైపు రాకపోకలను అదుపు చేస్తున్నారు. ఇప్పటికే భద్రాచలం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే బస్సులను ఆర్టీసీ రద్దు చేసింది.

కాగా, భద్రాచలం చరిత్రలో రెండు పర్యాయాలు మాత్రమే గోదావరి నీటిమట్టం 70 అడుగులు దాటింది. 60 అడుగుల నీటిమట్టం నాలుగు సార్లు దాటింది. 1986 ఆగస్టు 16న గోదావరి నీటిమట్టం 75.65 అడుగులకు చేరింది. ఆ తర్వాత ఆ స్థాయిలో వరద ఎప్పుడూ రాలేదు.

More Telugu News