Narendra Modi: విప్లవాత్మక మార్పు.. దేశంలో ప్రతి వ్యక్తికి హెల్త్ కార్డుపై మోదీ కీలక ప్రకటన

health card for everyone modi
  • నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ ప్రారంభం
  • ప్రతి పౌరుడికి ఒక ఐడీ నంబర్‌
  • ప్రజల ఆరోగ్య డేటా నిక్షిప్తం
  • జాతీయ స్థాయిలో అందుబాటులో సమాచారం
‘వన్‌ నేషన్‌.. వన్‌ హెల్త్‌’ దిశగా దేశంలో నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్‌(ఎన్‌డీహెచ్‌ఎం)ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. దీని కింద ప్రతి పౌరుడికి ఒక ఐడీ నంబర్‌ను కేటాయించనున్నారు. ఈ పథకంలో ప్రజలు తమ ఆరోగ్య డేటాను ‘ఈ-రికార్డులు’గా అప్‌ లోడ్‌ చేసుకోవచ్చు.

దీని వల్ల ప్రజల ఆరోగ్య చికిత్సలకు సంబంధించిన డేటా నిక్షిప్తం అవుతుంది. భవిష్యత్‌లో వారు మరో చికిత్స కోసం దేశంలోని ఏ ఆసుపత్రిలో చేరినా, ఆ సమయంలో ఈ డేటాను వైద్యులు, ఆసుపత్రులు వినియోగించుకునే అవకాశాలు ఉంటాయి. ప్రజలు ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా ఆసుపత్రికి వెళ్లినా, వారి ఆరోగ్య గుర్తింపు సంఖ్య ఆధారంగా డాక్టర్లు హెల్త్‌ రికార్డులను పరిశీలించి గతంలో రోగికి అందిన వైద్యం గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. దీని వల్ల గత రికార్డుల ఆధారంగానూ రోగికి మెరుగైన వైద్యం అందుతుంది. ఈ వివరాలు బయట ఇతరులకు ఎవ్వరికీ చెప్పకుండా గోప్యతనూ పాటిస్తారు.

ఎర్రకోట వేదికగా చేసిన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం సందర్భంగా ఈ పథకాన్ని ప్రారంభించిన అనంతరం మోదీ మాట్లాడుతూ.. పూర్తిగా టెక్నాలజీ ఆధారితమైన ఈ మిషన్‌ వైద్యరంగంలో విప్లవాత్మకమైన మార్పులకు దోహదం చేస్తుందని తెలిపారు. దీని ద్వారా ప్రతి భారతీయుడి సమగ్ర వైద్యసమాచారం ఆ ఐడీ ద్వారా లభిస్తుందన్నారు. ప్రతి పౌరుడికి ఒక ఐడీ కార్డు లభిస్తుందని, ఆసుపత్రి లేక ఫార్మసీకి వెళ్లిన ప్రతిసారి జాతీయ స్థాయిలో ఆ సమాచారం మొత్తం కార్డులో నిక్షిప్తమవుతుందని తెలిపారు.

ఇది ఆయుష్మాన్ భారత్ ప్రధాన్‌ మంత్రి జన్‌ ఆరోగ్య యోజన  పరిధిలోకి వస్తుందని వివరించారు. భారత్‌లో ఆరోగ్య సేవల సామర్థ్యంతో పాటు పనితీరు, పారదర్శకతను పెంచుతుందన్నారు. ఇందులోని పౌరుల సమాచారం బయటకు రాకుండా చూసేందుకు సంబంధిత వ్యక్తుల ఆరోగ్య వివరాలను వైద్యులు, హెల్త్‌ ప్రొవైడర్లు ఒకసారి మాత్రమే పొందే అవకాశం ఉందని తెలిపారు.
Narendra Modi
BJP
India

More Telugu News