Sachin Tendulkar: తాగే వయసు రాకముందే షాంపైన్ బాటిల్ ఇచ్చారు: సచిన్ టెండూల్కర్ షేర్ చేసుకున్న మధుర జ్ఞాపకం!

  • సరిగ్గా 30 ఏళ్ల క్రితం సచిన్ తొలి సెంచరీ
  • ఇంగ్లండ్ తో మాంచెస్టర్ లో మ్యాచ్
  • మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ తో పాటు షాంపైన్ బాటిల్
  • ఏం చేసుకుంటావని ఆట పట్టించిన సీనియర్లు
  • అప్పటికి తన వయసు 17 ఏళ్లేనన్న సచిన్
Sachin Remembers first century Moments

క్రికెట్ చరిత్రలో వంద సెంచరీలను పూర్తి చేసుకున్న ఏకైక ఆటగాడు, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తొలిసారిగా సెంచరీ చేసి నేటికి సరిగ్గా 30 సంవత్సరాలు కాగా, ఆనాటి జ్ఞాపకాలను తాజాగా పంచుకున్నారు. 1990, ఆగస్టు 14న మాంచెస్టర్ లో ఇంగ్లండ్ తో జరిగిన టెస్టులో సచిన్, తన ఫస్ట్ సెంచరీ చేశారు. ఆ మరుసటి రోజే స్వాతంత్ర్య దినోత్సవం కావడంతో సచిన్ సెంచరీని అన్ని పత్రికలూ ఇండిపెన్డెన్స్ డేతో ముడిపెడుతూ శీర్షికలు పెట్టాయి. ఇదే మ్యాచ్ డ్రాగా ముగిసింది.

ఆనాటి మధుర జ్ఞాపకాలను నెమరు వేసుకున్న సచిన్, టెస్ట్ మ్యాచ్ ని కాపాడటం తనకు సరికొత్త అనుభూతిని ఇచ్చిందని చెప్పారు. ఆ మ్యాచ్ లో తాను 119 పరుగులతో నాటౌట్ గా నిలవడంతో, మ్యాచ్ డ్రా అయిందని, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుతో పాటు షాంపెయిన్ బాటిల్ ను తనకు ఇచ్చారని, అప్పటికి తనకు 17 సంవత్సరాలేనని, తాగేందుకు అధికారిక వయసు కూడా లేదని గుర్తు చేసుకున్నారు. ఈ బాటిల్ ను ఏం చేస్తావంటూ, అప్పటి సీనియర్ ఆటగాళ్లు తనను ఆటపట్టించారని చెప్పారు. ఆ సెంచరీ చేసినందుకు సంజయ్ మంజ్రేకర్, తనకు ఓ తెల్లటి షర్ట్ ను గిఫ్ట్ గా ఇచ్చారని, దాన్ని తాను మరువలేదని అన్నారు.

ఆ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో అప్పటి భీకర బౌలర్ డెవాన్ మాల్కోమ్ విసిరిన బంతి తన తల వెనుక తగిలిందని, తాను నొప్పితో ఉన్నానని ఇంగ్లండ్ ఆటగాళ్లకు తెలియపరచడం ఇష్టం లేక, ఫిజియోను కూడా పిలవలేదని అన్నారు. తనతో ప్రాక్టీస్ చేయించే సమయంలో బంతి తగిలినా కూడా ఆటను కొనసాగించాలని కోచ్ అచ్రేకర్ చెబుతుండే వారని, తాను దాన్నే కొనసాగించానని తెలిపారు.

More Telugu News