Telangana: తెలంగాణలో సోమవారం వరకు అతి భారీ వర్షాలు.. వాతావరణ కేంద్రం హెచ్చరిక

Heavy rains forecast in Telangana for another three days
  • ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలకు సమీపంలో అల్పపీడనం
  • రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం
  • ప్రమాదకరంగా పొంగి ప్రవహిస్తున్న వాగులు
బంగాళాఖాతంలో ఓవైపు ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండగా, మరోవైపు దీని ప్రభావంతో నిన్న ఉదయం ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలకు సమీపంలో అల్పపీడనం ఏర్పడింది. దీంతో నేటి నుంచి సోమవారం వరకు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

నిజానికి బుధవారం నుంచే రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పుడివి భారీ వర్షాలుగా మారే అవకాశం ఉండడంతో వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా ఆదిలాబాద్, నిర్మల్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఉభయ వరంగల్ జిల్లాలు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. కాబట్టి, ఆయా జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.

ఇప్పటికే ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లోని వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఫలితంగా ఆయా జిల్లాల్లోని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇక నిన్న ఉదయం వరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడులో 17 సెంటీమీటర్ల వర్షం కురవగా, అదే జిల్లాలోని వెంకటాపురంలో 15, పాల్వంచలో 14, భద్రాచలంలో 13, కొత్తగూడెం, జూలూరుపాడు, మహబూబాబాద్‌లలో 10, బయ్యారం, గార్లలో 9 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది.

ఖమ్మం జిల్లాలోని వైరా జలాశయం నిన్న సాయంత్రానికి పూర్తిస్థాయి నీటిమట్టాన్ని దాటి 19.6 అడుగులు దాటేసి ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. తాలిపేరు జలాశయంలో 18 గేట్లు ఎత్తివేసి 61 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. భద్రాచలంలో బుధవారం రాత్రి 30 అడుగులుగా ఉన్న నీటి మట్టం గురువారం సాయంత్రానికి 35.5 అడుగులకు చేరుకోవడం గమనార్హం. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజీ నుంచి నీటి విడుదల కొనసాగుతోంది.
Telangana
Heavy rains
low pressure
Hyderabad

More Telugu News