Badminton: షట్లర్ సిక్కిరెడ్డికి కరోనా.. గోపీచంద్ అకాడమీ మూత

Badminton star Sikki Reddy infected to corona virus
  • 5 నెలల తర్వాత ప్రారంభమైన శిక్షణ శిబిరం
  • పీవీ సింధు, గోపీచంద్ సహా 18 మందికి నెగటివ్
  • నేడు మరోమారు అందరికీ కొవిడ్ పరీక్షలు
మహిళల డబుల్స్ స్టార్ షట్లర్ నేలకుర్తి సిక్కిరెడ్డి, ఫిజియోథెరపిస్ట్ చల్లగుండ్ల కిరణ్ కరోనా బారినపడ్డారు. దీంతో శానిటైజేషన్ కోసం గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్ అకాడమీని తాత్కాలికంగా మూసివేశారు. దాదాపు 5 నెలల తర్వాత శిక్షణ శిబిరం తెరుచుకోగా, అంతలోనే మూతపడడం గమనార్హం. భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) నిబంధనల ప్రకారం శిబిరంలో పాల్గొనే క్రీడాకారులు, కోచ్‌లు, సహాయక సిబ్బంది కచ్చితంగా కొవిడ్ పరీక్షలు చేయించుకోవాల్సిందే.

దీంతో మంగళవారం మొత్తం 20 మందికి పరీక్షలు నిర్వహించారు. పీవీ సింధు, ఆమె తండ్రి పీవీ రమణ, కోచ్‌ గోపీచంద్, సాయిప్రణీత్, కిడాంబి శ్రీకాంత్‌ సహా 18 మందికి నెగటివ్ ఫలితాలు రాగా, సిక్కిరెడ్డి, ఫిజియో కిరణ్‌లకు వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. అయితే, వీరిలో ఎలాంటి లక్షణాలు లేవని సాయ్ పేర్కొంది. కాగా, మంగళవారం పరీక్షలు నిర్వహించిన అందరికీ నేడు మరోమారు స్థానిక కార్పొరేట్ ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించనున్నారు. కోచింగ్ క్యాంపు సజావుగా సాగేందుకు అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నామని, త్వరలోనే శిబిరం మళ్లీ ప్రారంభం అవుతుందని గోపీచంద్ ఆశాభావం వ్యక్తం చేశారు.
Badminton
Pullela Gopichand
Corona Virus
Sikky reddy

More Telugu News