Online Gaming: ఆన్ లైన్ గేమ్స్ పేరిట రూ.1100 కోట్లు కొల్లగొట్టిన చైనా కంపెనీలు... గుట్టురట్టు చేసిన హైదరాబాదు పోలీసులు

Hyderabad police busted thousand crores online gaming scam
  • వెబ్ సైట్ల ద్వారా ఆన్ లైన్ గేములు
  • మోసపోతున్న యువత
  • పెద్దమొత్తంలో నష్టపోయి ఆత్మహత్యలు
చైనా, భారత్ కేంద్రాలుగా కార్యకలాపాలు సాగిస్తున్న పలు సంస్థలు ఆన్ లైన్ గేముల పేరిట రూ.1100 కోట్లు కొల్లగొట్టిన వైనాన్ని హైదరాబాద్ పోలీసులు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు ఓ చైనీయుడు సహా ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. దీనిపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ మీడియాకు వివరాలు తెలిపారు. ఈ రాకెట్లో భారతీయులతో పాటు చైనీయులు కూడా ఉన్నారని వెల్లడించారు.

గ్రోయింగ్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్, సిల్లీ కన్సల్టింగ్ సర్వీసెస్, పాన్ యూన్ టెక్నాలజీస్, డైసీ లింక్ ఫైనాన్షియల్, హువాహో ఫైనాన్షియల్ సంస్థలు ఆన్ లైన్ లో గేమింగ్ పేరిట దోచుకుంటున్నట్టు గుర్తించామని, గురుగ్రామ్ కు చెందిన రాహుల్ ముంజాల్, ధీరజ్ సర్కార్, చైనాకు చెందిన లిన్ యాంగ్, మింగ్ యాంగ్, జింగ్ లింగ్ వాంగ్, ఢిల్లీకి చెందిన నీరజ్ కుమార్ తులి ఆయా సంస్థల డైరెక్టర్లుగా గుర్తించామని తెలిపారు. ఓ బ్యాంకులో వీటికి సంబంధించిన ఖాతాల్లోని రూ.30 కోట్లను సీజ్ చేశామని అన్నారు.

వీటికి సంబంధించిన వెబ్ సైట్లు చైనా నుంచి కార్యకలాపాలు సాగిస్తున్నాయని, వీటి డేటాబేస్ క్లౌడ్ లో ఉందని వివరించారు. ఈ సైట్లలో బెట్టింగ్ కు పాల్పడుతూ యువత పెద్ద మొత్తంలో నష్టపోతున్నారని ఆయన తెలిపారు. చాలామంది ఈ ఆన్ లైన్ గేమింగ్ లో మోసపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వెల్లడించారు. ఈ చైనా సైట్లు భారత్ కు చెందిన స్థానిక గేమింగ్ ను ఆధారంగా చేసుకుని మూడు ముక్కలాట, లోన-బయట, ఇండియన్ రమ్మీ వంటి ఆటలతో యువతకు గాలం వేస్తున్నాయని సీపీ అంజనీ కుమార్ చెప్పారు.
Online Gaming
Scam
China Companies
Hyderabad
Anjani Kumar
Police

More Telugu News