India: కరోనా ఎఫెక్ట్: ప్రపంచ జనాభాలో సగం మంది యువత కుంగుబాటులో!

  • 112 దేశాల్లో 12 వేల మంది విద్యావంతులైన యువతపై సర్వే
  • ప్రతి ఇద్దరిలో ఒకరిలో మానసిక కుంగుబాటు
  • భారత్‌లో దీని ప్రభావం మరింత అధికం
Youth under depression amid coronavirus

కరోనా వైరస్ ఏమంటూ ఈ ప్రపంచంలోకి వచ్చిందో కానీ, దాదాపు సగం మంది యువతను కుంగుబాటులోకి, ఆందోళనలోకి నెట్టేసింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఇద్దరిలోనూ ఒకరు అంటే 50 శాతం మంది మానసిక కుంగుబాటు ముప్పును ఎదుర్కొంటున్నట్టు తాజా సర్వే ఒకటి వెల్లడించింది.

ఉద్యోగాలు కోల్పోయి కొందరు, వేతనాల్లో కోతతో మరికొందరు కుంగుబాటుకు గురవుతున్నట్టు సర్వేలో తేలినట్టు అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) పేర్కొంది. ‘యువత- కొవిడ్19: వారి ఉద్యోగాలు, విద్య, హక్కులు, మానసిక స్థితిపై ప్రభావం’ పేరిట నిర్వహించిన ఈ సర్వే వివరాలను ఐఎల్‌ఓ తాజాగా బయటపెట్టింది.

మొత్తం 112 దేశాల్లో 18-29 ఏళ్ల వయసున్న 12 వేల మంది విద్యావంతులైన యువతపై ఈ సర్వే నిర్వహించింది. ఈ సందర్భంగా ప్రతి ఇద్దరిలో ఒకరు మానసిక ఆందోళన, కుంగుబాటుకు గురవుతున్నట్టు తేలగా, మరో 17 శాతం మంది యువత ఇప్పటికే దాని ప్రభావానికి లోనవుతున్నట్టు సర్వే తెలిపింది.

కరోనా ప్రతికూల ప్రభావం వీరిపై ఎక్కువగా ఉందని, ముఖ్యంగా 18-24 ఏళ్ల లోపు యువతపై మరింత ఎక్కువగా ఉందని సర్వేలో వెల్లడైంది. చదువులో ఫెయిల్ అవుతామేమోనన్న బెంగతో 22 శాతం మంది, భవిష్యత్తు నిరాశాజనకంగా మారిందని 38 శాతం మంది కుంగుబాటులోకి వెళ్లిపోయే పరిస్థితులు ఉన్నట్టు ఐఎల్ఓ సర్వే తేల్చింది. కరోనా సంక్షోభ ప్రభావం భారత్ సహా అభివృద్ధి చెందుతున్న, పేద దేశాల యువతపైనే ఎక్కువగా ఉందని ఐఎల్‌ఓ డైరెక్టర్ జనరల్ గయ్ రైడర్ పేర్కొన్నారు.

More Telugu News