MS Dhoni: 2022 వరకు ధోనీ తమతోనే ఉంటాడని భావిస్తున్న సీఎస్కే

  • వరల్డ్ కప్ తర్వాత ఒక్క మ్యాచ్ కూడా ఆడని ధోనీ
  • మరో రెండు సీజన్లపాటు ధోనీ సేవలపై ఢోకాలేదన్న సూపర్ కింగ్స్ సీఈఓ
  • ఆగస్టు 21న యూఏఈ బయల్దేరనున్న సీఎస్కే
CSK hopes Dhoni will be available for next two seasons

ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) ఫ్రాంచైజీతో మహేంద్ర సింగ్ ధోనీ ప్రస్థానం విడదీయలేనిది. ఫిక్సింగ్ ఆరోపణల కారణంగా ఓసారి చెన్నై ఫ్రాంచైజీపై నిషేధం విధించిన సమయంలో మాత్రం ధోనీ మరో జట్టుకు ఆడాల్సి వచ్చింది. ఆ ఒక్కసారి మినహా ధోనీ లేని చెన్నై సూపర్ కింగ్స్ జట్టును ఊహించలేం. ఈ అంశంపై సూపర్ కింగ్స్ సీఈఓ కాశీ విశ్వనాథన్ స్పందిస్తూ, తమతో మరికొన్నేళ్ల పాటు పయనిస్తాడని భావిస్తున్నామని తెలిపారు. గతేడాది ఇంగ్లాండ్ గడ్డపై జరిగిన వరల్డ్ కప్ తర్వాత ధోనీ అంతర్జాతీయ క్రికెట్ లో ఆడకపోయినప్పటికీ, ఐపీఎల్ కు అందుబాటులో ఉండాలని నిర్ణయించుకున్నాడు.

ధోనీ 2021, 2022 సీజన్ల వరకు సీఎస్కే జట్టుతోనే ఉంటాడని అనుకుంటున్నట్టు కాశీ విశ్వనాథన్ వెల్లడించారు. ప్రస్తుతం ధోనీకి సంబంధించిన సమాచారం మీడియా ద్వారానే తెలుసుకుంటున్నామని, ఐపీఎల్ కోసం ధోనీ తన సొంత రాష్ట్రం ఝార్ఖండ్ లో ఇండోర్ నెట్స్ లో ప్రాక్టీసు చేస్తున్నట్టు తెలిసిందని, అయితే తమ కెప్టెన్ ధోనీ ఆటతీరు పట్ల తమకు ఎప్పుడూ బాధ లేదని అన్నారు.

"తన బాధ్యతలు ఏమిటో ధోనీకి తెలుసు. తన గురించి, జట్టు గురించి తనే చూసుకుంటాడు" అని అభిప్రాయపడ్డారు. సెప్టెంబరు 19న యూఏఈ వేదికగా మొదలయ్యే ఐపీఎల్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆగస్టు 21న బయల్దేరనుంది. అంతకుముందు ఆగస్టు 14న జట్టు ఆటగాళ్లంతా చెన్నైలో కలుసుకోనున్నారు.

More Telugu News