కరోనా చికిత్సకు మరో ఔషధం.. క్లినికల్ ట్రయల్స్‌కు డీసీజీఐ అనుమతి

12-08-2020 Wed 10:48
Mankind Pharma joins hands with Daewoong to test niclosamide for COVID
  • ‘నిక్లోసమైడ్’ పేరుతో మ్యాన్‌కైండ్ ఫార్మా నుంచి ఔషధం
  • ఫేజ్-1 క్లినికల్ ట్రయల్స్ కోసం దక్షిణ కొరియాకు చెందిన దేవూంగ్‌తో ఒప్పందం
  • ప్రాథమిక పరీక్షల్లో సత్ఫలితాలు

ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా వైరస్‌ను సమూలంగా తరిమికొట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు అభివృద్ధి చేసిన టీకాలు వివిధ దశల్లో పరీక్షల్లో ఉండగా, రష్యా ఇప్పటికే ఓ టీకాను అందుబాటులోకి తీసుకొచ్చింది. అలాగే కరోనా చికిత్సకు కూడా ఇప్పటికే కొన్ని ఔషధాలు వచ్చాయి. ఈ క్రమంలో తాజాగా, ‘నిక్లోసమైడ్’ అనే పేరుతో మ్యాన్‌కైండ్ ఫార్మా ఓ ఔషధాన్ని అభివృద్ధి చేసింది.

భారత్‌లో తొలిదశ ప్రయోగాలకు భారత ఔషధ నియంత్రణ మండలి  (డీసీజీఐ) నుంచి దీనికి ఇప్పటికే అనుమతి లభించింది. మరోవైపు, ఫేజ్-1 క్లినికల్ ట్రయల్స్ కోసం దక్షిణ కొరియాకు చెందిన దేవూంగ్ ఫార్మాస్యూటికల్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు మ్యాన్‌కైండ్ ఫార్మా సీవోవో అర్జున్ జునేజ్ తెలిపారు. ప్రాథమిక పరీక్షల్లో ఈ ఔషధం మంచి ఫలితాలు ఇచ్చినట్టు అర్జున్ తెలిపారు.