Heron Drones: హెరాన్ డ్రోన్లకు శక్తిమంతమైన ఆయుధాలు అమర్చాలంటున్న సాయుధ బలగాలు

  • కొంతకాలంగా ఇజ్రాయెల్ తయారీ డ్రోన్లు వాడుతున్న భారత్
  • డ్రోన్లను బలోపేతం చేసే దిశగా చర్యలు
  • కేంద్రం ముందుకు ప్రతిపాదనలు
Indian armed forces wants their Heron Drones will be equipped with arms

ఇటీవల చైనాతో సరిహద్దు ఘర్షణల అనంతరం భారత సాయుధ బలగాల దృక్పథంలో మార్పు వచ్చినట్టు కనిపిస్తోంది. గతంలో శాంతి మంత్రం జపిస్తూ, ఇతర దేశాలకు ఆదర్శంగా నిలిచిన మన జవాన్లు... చైనా వంటి కుట్రదారును ఎదుర్కోనేందుకు అవసరమైన మేర దూకుడు ప్రదర్శించాలని భావిస్తున్నారు. ఇప్పటికే భారీ స్థాయిలో ఆయుధ సమీకరణ చేపట్టిన భారత్... చైనాకు స్పష్టమైన హెచ్చరికలు పంపుతోంది. ఈ క్రమంలో భారత సాయుధ బలగాలు తమ డ్రోన్లను కూడా శక్తిమంతమైన ఆయుధాలతో బలోపేతం చేయాలని నిర్ణయించాయి.

భారత్ కొంతకాలంగా సరిహద్దు ప్రాంతాల్లో ఇజ్రాయెల్ తయారీ హెరాన్ డ్రోన్లను వినియోగిస్తోంది. ఇకపై ఈ డ్రోన్లకు లేజర్ గైడెడ్ బాంబులు, ప్రెసిషన్ గైడెడ్ బాంబులు, యాంటీ-ట్యాంకు మిస్సైళ్లు అమర్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ప్రాజెక్ట్ చీటా పేరిట గతంలోనే ఈ ప్రతిపాదన చేసినా, అంచనాల వ్యయం రూ.3,500 కోట్లుగా పేర్కొన్న నేపథ్యంలో ఆ ప్రతిపాదన పెండింగ్ లో ఉండిపోయింది. ప్రస్తుతం చైనాతో ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో ఈ ప్రతిపాదనలను భారత సాయుధ బలగాలు మళ్లీ తెరపైకి తీసుకువచ్చాయి.

ఈ ప్రాజెక్టులో భాగంగా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ బలగాలకు చెందిన 90 వరకు హెరాన్ డ్రోన్లను అప్ గ్రేడ్ చేస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వీటికి అత్యాధునిక శత్రు విధ్వంసక వ్యవస్థలు అమర్చడమే ఈ ప్రాజెక్టు ఉద్దేశమని వివరించాయి. అయితే ఈ ప్రతిపాదనలకు రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన హైలెవల్ కమిటీ ఆమోదం లభించాల్సి ఉంది.

More Telugu News