RBI: రూ. 2 వేల నోట్ల ప్రింటింగ్ ను పూర్తిగా నిలిపివేసిన రిజర్వ్ బ్యాంక్!

  • రూ. 500 నోట్ల ముద్రణ క్రమంగా పెంపు
  • గత సంవత్సరం ఒక్క రూ. 2 వేల నోటునూ ముద్రించలేదు
  • సమాచార హక్కును ఉపయోగించి తెలుసుకున్న కార్యకర్త
RBI Stops 2000 Note Printing

గడచిన ఆర్థిక సంవత్సరంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఒక్క 2 వేల రూపాయల నోటును కూడా ముద్రించ లేదు. ఈ విషయాన్ని ఆర్టీఐ కార్యకర్త జలగం సుధీర్ పెట్టుకున్న దరఖాస్తుకు సమాధానంగా స్వయంగా ఆర్బీఐ తెలియజేసింది. నాలుగు సంవత్సరాల క్రితం రూ. 1000, రూ. 500 నోట్లను రద్దు చేసి, ఆపై రూ. 2000 నోటును కేంద్రం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఆపై 2016-17 ఆర్ధిక సంవత్సరంలో రూ. 354.29 కోట్లు, 2017-18లో రూ. 11.15 కోట్లు, 2018-19లో రూ. 4.66 కోట్ల విలువైన 2 వేల నోట్లను ముద్రించిన ఆర్బీఐ గత సంవత్సరం మాత్రం ఎటువంటి ముద్రణా కార్యకలాపాలు చేపట్టలేదు.

ఇదే సమయంలో రూ. 500 నోట్ల ముద్రణ మాత్రం గణనీయంగా పెరిగింది. 2016-17లో ముద్రితమైన రూ. 429.22 కోట్ల విలువైన 500 నోట్లతో పోలిస్తే, గత సంవత్సరం దాదాపు రెట్టింపుగా రూ. 822.77 కోట్ల విలువైన ముద్రణ జరిగిందని ఆర్బీఐ పేర్కొంది. మొత్తం మీద ఈ నాలుగేళ్లలో రూ. 2,458.57 కోట్ల విలువైన రూ. 500 నోట్లు, రూ. 370.10 కోట్ల విలువైన రూ. 2 వేల నోట్లను ఆర్బీఐ ముద్రించింది.

ఇక 1, 2, 5 రూపాయల నోట్ల ముద్రణను సైతం ఆర్బీఐ గత నాలుగేళ్లుగా నిలిపివేసింది. అన్ని రకాల నోట్లనూ కలిపి గత నాలుగేళ్లలో 7,071.63 కొత్త నోట్లను ముద్రించినట్టు ఆర్బీఐ వెల్లడించింది. ముద్రణా వ్యయం విషయానికి వస్తే రూ. 200 నోటుకు అత్యధికంగా రూ. 2.15 చొప్పున ఖర్చు పెడుతున్నామని, రూ. 500 నోటుకు రూ. 2.13, రూ. 100 నోటుకు రూ. 1.34 ఖర్చవుతోందని పేర్కొంది. రూ. 50 నోటుకు 82 పైసలు, రూ. 20 నోటుకు 85 పైసలు, రూ. 10 నోటుకు రూ. 75 పైసలు వ్యవమవుతోందని వెల్లడించింది.

More Telugu News