Schools: సెప్టెంబరు 1 నుంచి పాఠశాలల పునఃప్రారంభం.. 33 శాతం సిబ్బందితో తరగతులు!

  • దశల వారీగా తెరిచేందుకు మార్గదర్శకాలు సిద్ధం చేస్తున్న కేంద్రం
  • స్థానిక పరిస్థితుల ఆధారంగా రాష్ట్రాలకు అధికారం
  • తొలుత 10 నుంచి 12 వ తరగతులకు ప్రత్యక్ష తరగతులు
Schools will reopen from sep 1st in India

కరోనా వైరస్ కారణంగా మూతపడిన పాఠశాలలను తిరిగి తెరిచేందుకు కేంద్రం సమాయత్తమవుతోంది. సెప్టెంబరు 1 నుంచి నవంబరు 14 మధ్య దశల వారీగా బడులు తెరవాలని నిర్ణయించింది. అయితే, ఈ విషయంలో స్థానిక పరిస్థితుల ఆధారంగా నిర్ణయం తీసుకునే అధికారాన్ని మాత్రం రాష్ట్రాలకే వదిలేసింది. అన్‌లాక్ ప్రక్రియలో భాగంగా ఈ నెలాఖరు నాటికి విస్తృతస్థాయి ‘స్టాండింగ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్’ను విడుదల చేయనుంది.

ఆగస్టు 31 తర్వాత అనుసరించాల్సిన విధివిధానాలను ఇందులో పేర్కొననుంది. విద్యార్థులు ఎప్పుడు, ఏ విధానంలో తరగతులకు హాజరుకావొచ్చన్నది రాష్ట్రప్రభుత్వాలే నిర్ణయించాల్సి ఉంటుంది. బోధన సిబ్బంది, విద్యార్థుల్లో 33 శాతం సామర్థ్యంతో షిఫ్టుల వారీగా తరగతులను నడపాలని, అలాగే, విద్యార్థులు క్లాస్ రూముల్లో 2, 3 గంటలకు మించి ఉండకుండా చూడాలని కేంద్రం తన మార్గదర్శకాల్లో పేర్కొననుంది.

తొలి షిప్టును ఉదయం 8 గంటల నుంచి 11 వరకు, రెండో షిప్టును మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ మధ్య ఉండే గంట విరామ సమయంలో తరగతి గదులను శానిటైజ్ చేయాల్సి ఉంటుంది. అయితే, 10 నుంచి 12వ తరగతి విద్యార్థులకు మాత్రమే భౌతిక క్లాసులు ఉంటాయి. చిన్నారులకు మాత్రం ఆన్‌లైన్ తరగతులనే కొనసాగించాల్సి ఉంటుందని కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

More Telugu News