క్యారీబ్యాగ్ కు రూ. 8 వసూలు చేసిన 'బ్రాండ్ ఫ్యాక్టరీ'పై రూ. 30 వేల జరిమానా!

07-08-2020 Fri 06:26
  • డబ్బు వసూలు చేసే హక్కు షాపులకు లేదు
  • బ్రాండ్ ఫ్యాక్టరీపై రూ. 30 వేల జరిమానా
  • పంజాబ్ లో తీర్పిచ్చిన వినియోగదారుల ఫోరం
Fine to Brand Factory For Charging Carrybag
షాపింగ్ మాల్స్, దుకాణాల్లో కస్టమర్ల నుంచి క్యారీ బ్యాగుల కోసం డబ్బులు వసూలు చేయరాదని కోర్టులు ఎన్నిమార్లు హెచ్చరిస్తున్నా, దుకాణాల తీరు మాత్రం మారడం లేదు. తాజాగా, అదే కేసులో ఇరుక్కున్న బ్రాండ్ ఫ్యాక్టరీ, భారీ జరిమానాను కట్టాల్సిన పరిస్థితిని కొని తెచ్చుకుంది. ఈ ఘటన పంజాబ్ లోని మొహాలీ జిల్లా జిర్కార్ పూర్ లో జరిగింది.

వివరాల్లోకి వెళితే, ఇక్కడ బ్రాండ్ ఫ్యాక్టరీలో ఓ కస్టమర్ నుంచి క్యారీ బ్యాగ్ పేరిట రూ. 8 వసూలు చేశారు. దీంతో సదరు కస్టమర్ వినియోగదారుల ఫోరంను ఆశ్రయించగా, కేసును విచారించిన న్యాయమూర్తి, క్యారీ బ్యాగ్ కోసం అదనంగా డబ్బును వసూలు చేసే చట్టపరమైన, నైతికపరమైన హక్కు దుకాణాలకు లేదని పేర్కొన్నారు. బ్రాండ్ ఫ్యాక్టరీపై రూ. 30 వేల జరిమానాతో పాటు, సదరు వినియోగదారుడికి రూ. 2 వేలు, అతని నుంచి వసూలు చేసిన రూ. 8 తిరిగి ఇచ్చేయాలని ఫోరం తీర్పిచ్చింది.