చిరంజీవితో రీమేక్ సినిమా చేయనున్న మెహర్ రమేశ్!

06-08-2020 Thu 20:11
  • 'లూసిఫర్' ప్రాజక్టును పక్కన పెట్టిన చిరంజీవి 
  • స్క్రిప్టుతో సిద్ధంగా వున్న దర్శకుడు బాబీ
  • 'వేదాళం' రీమేక్ చేయనున్న మెహర్ రమేశ్    
Mehar Ramesh to direct Chiranjeevi
ప్రస్తుతం 'ఆచార్య' చిత్రంలో నటిస్తున్న చిరంజీవి నటించే తదుపరి సినిమా ఏదన్న విషయంపై రకరకాల వార్తలొస్తున్నాయి. దీని తర్వాత సుజిత్ దర్శకత్వంలో మలయాళ హిట్ సినిమా 'లూసిఫర్' రీమేక్ ఉంటుందని మొన్నటి వరకు వార్తలొచ్చాయి. అయితే, ఆ సినిమా స్క్రిప్టు విషయంలో సుజిత్ చేసిన మార్పులు చేర్పులు చిరంజీవికి నచ్చక, ఆ ప్రాజక్టును తాత్కాలికంగా పక్కన పెట్టారని ఇటీవల ప్రచారం జరిగింది. దీంతో 'ఆచార్య' తర్వాత బాబీ దర్శకత్వంలో చిరంజీవి సినిమా ఉంటుందనీ, స్క్రిప్టు కూడా సిద్ధమైందనీ అన్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా మరో వార్త ఫిలిం నగర్లో షికారు చేస్తోంది. అదేమిటంటే, మెహర్ రమేశ్ దర్శకత్వంలో చిరంజీవి తన తదుపరి చిత్రాన్ని చేయనున్నారట! ఆమధ్య అజిత్ హీరోగా తమిళంలో వచ్చిన 'వేదాళం' చిత్రానికి రీమేక్ గా ఇది రూపొందుతుందనీ, ప్రస్తుతం మెహర్ రమేశ్ దీనిపై వర్క్ చేస్తున్నాడనీ అంటున్నారు. దీనిని ప్రముఖ నిర్మాత కె.ఎస్.రామారావు నిర్మించే అవకాశం వుందని సమాచారం. వాస్తవానికి ఈ 'వేదాళం' చిత్రాన్ని ఆమధ్య పవన్ కల్యాణ్ రీమేక్ చేయాలనుకున్నారు. ఎందుకో ఆ తర్వాత ఆయన డ్రాప్ అయ్యారు.