Mumbai: ముంబైలో గత పదిహేనేళ్లలో ఎన్నడూ లేనంత వర్షం!

  • ముంబై ప్రజల తీవ్ర అవస్థ
  • రెడ్ అలర్ట్ ప్రకటించిన ప్రభుత్వం
  • ప్రజా రవాణా బంద్
  • మరో రెండు రోజులు వర్షాలు కురుస్తాయన్న ఐఎండీ
Heavy Rains in Mumbai

ఎడతెరిపిలేని వర్షాలతో దేశ ఆర్థిక రాజధాని ముంబై ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. గత 15 సంవత్సరాల్లో ఇంతగా వర్షం కురవడం ఇదే మొదటిసారి కాగా, చాలా ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి. లోతట్టు ప్రాంతాల్లోని కాలనీల అపార్టుమెంట్లలోని సెల్లార్లలోకి నీరు ప్రవేశించి, వేలాది వాహనాలు పనికిరాకుండా పోయాయి. ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని ప్రకటించిన మహారాష్ట్ర ప్రభుత్వం, ముంబైతో పాటు థానే, పుణే తదితర జిల్లాల్లో రెడ్ అలర్ట్ ను ప్రకటించింది.

మరో రెండు రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించడంతో ప్రజలు మరింత ఆందోళన చెందుతున్నారు. వరద నీటిలో చిక్కుకున్న వారికి సాయపడేందుకు సహాయక బృందాలు రంగంలోకి దిగాయని ప్రభుత్వం పేర్కొంది. కాగా, శాంతాక్రజ్ లో ఓ ఇల్లు కూలిపోగా ఓ మహిళ, ఆమె ఇద్దరు పిల్లలు నీటిలో కొట్టుకుపోయారు. వరద నీటిలో కొట్టుకుపోతూ, కనిపించిన కరెంట్ స్తంభాన్ని పట్టుకున్న ఓ బాలుడు విద్యుత్ షాక్ తో మృతిచెందాడు.

సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో ఓ చేపల బోటు మునిగిపోయిందని అధికారులు వెల్లడించారు. ముంబై నగర వ్యాప్తంగా ఎమర్జెన్సీ సర్వీసులు మినహా ప్రజా రవాణాను మొత్తం నిలిపివేశారు. ప్రభుత్వ కార్యాలయాలన్నింటికీ సెలవు ప్రకటించారు. కాగా, మహారాష్ట్రతో పాటు కేరళ, కర్ణాటక తీర ప్రాంత జిల్లాలను కూడా వర్షం వణికిస్తోంది.

More Telugu News