'ధన్వంత్రి నారాయణ మహా గణపతి'... ఖైరతాబాద్ లో ఆరు అడుగుల విగ్రహ నిర్మాణం మొదలు!

05-08-2020 Wed 10:03
  • భారీ గణపతి స్థానంలో చిన్న విగ్రహం
  • ఉదయం 11 గంటలకు ముహూర్తం
  • వెల్లడించిన సింగరి సుదర్శన్
Only 6 Feet Ganesh Idol at Khairatabad
వినాయక చవితి పేరు చెబితే, గుర్తుకు వచ్చే భారీ గణపతి విగ్రహాల్లో హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లో కొలువుదీరే మహా గణపతికి ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఇక్కడ ఏర్పాటు చేసే భారీ గణనాధుని తిలకించేందుకు లక్షలాది మంది వస్తుంటారు. ఈ సంవత్సరం కరోనా మహమ్మారి కారణంగా, భారీ గణపతి స్థానంలో ఆరు అడుగుల వినాయక విగ్రహాన్ని మాత్రమే ప్రతిష్ఠిస్తున్నారు.

ఈ సంవత్సరం వినాయకుడు 'ధన్వంత్రి నారాయణ మహా గణపతి' ఆకృతిలో కొలువుదీరనున్నాడని ఖైరతాబాద్ మహా గణపతి ఉత్సవ కమిటీ ప్రెసిడెంట్ సింగరి సుదర్శన్ వ్యాఖ్యానించారు. విగ్రహాన్ని పూర్తిగా మట్టితోనే తయారు చేయనున్నామని ఆయన అన్నారు. విగ్రహ నిర్మాణం పనులు ఈరోజు ఉదయం 11 గంటలకు మొదలవుతాయని, వినాయక చవితికి రెండురోజుల ముందే పనులు పూర్తవుతాయని తెలిపారు.