India: మన భూ భాగాన్ని తమలో కలుపుకున్న పాక్ పై తీవ్రంగా స్పందించిన కేంద్రం!

  • తన దేశ మ్యాప్ ను మార్చిన పాక్
  • రాజకీయ అసంబద్ధ నిర్ణయమన్న భారత్
  • ప్రపంచం నమ్మబోదని మండిపాటు
India Fires on pakisthan new Map

మంగళవారం నాడు పాకిస్థాన్ సరిహద్దులను మార్చడంతో పాటు ఇండియాలోని పలు ప్రాంతాలు తమవేనంటూ పాకిస్థాన్ ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసిన మ్యాప్ పై భారత్ తీవ్రంగా స్పందించింది. ఇదంతా ఇమ్రాన్ ఖాన్ రాజకీయ ప్రయోజనాల కోసం తీసుకున్న అసంబద్ధ నిర్ణయమని మండిపడింది. ఏ మాత్రమూ ప్రపంచ ఆమోదంలేని ఈ మ్యాప్ ను ఎవరూ పట్టించుకోబోరని వ్యాఖ్యానిస్తూ, ఓ ప్రకటన విడుదల చేసింది.

"తమదేశపు రాజకీయ చిత్రపటంగా పాకిస్థాన్ పేర్కొన్న మ్యాప్ ను చూశాము. దీన్ని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ విడుదల చేశారు. ఇది రాజకీయ అసంబద్ధతే. సరిహద్దుల విషయంలో చెప్పే అబద్ధాలను ఏ మాత్రమూ అంగీకరించబోము. ఇండియాలో భాగమైన గుజరాత్, మా కేంద్ర పాలిత ప్రాంతాలైన జమ్ము అండ్ కాశ్మీర్, లడఖ్ లపై ఎవరూ ఆమోదించని వాదనలను పాక్ చేస్తోంది" అని వ్యాఖ్యానించింది. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించాలన్న పాకిస్థాన్ కుతంత్రం దీని వెనుక ఉందని ఆరోపించింది.

కాగా, నిన్న పాకిస్థాన్ కొత్త మ్యాప్ ను విడుదల చేస్తూ, జమ్మూ కశ్మీర్ కు ఉన్న ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేస్తూ, ఇండియా తీసుకున్న నిర్ణయంతో ఆ ప్రాంత వాసులంతా, తాము పాక్ తోనే ఉన్నామని, ఇండియా తమపై దాష్టీకాలు చేస్తోందని మొరపెట్టుకున్నారని ఇమ్రాన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అందుకే, తాము కొత్త మ్యాప్ ను విడుదల చేస్తున్నామని, కశ్మీర్ వాసులంతా ఇక తమవారేనని వ్యాఖ్యానించింది. ఇకపై దేశంలోని అన్ని పాఠశాలల్లో ఇదే మ్యాప్ ఉంటుందని కూడా ఆయన అన్నారు.

More Telugu News