VIVO: ఐపీఎల్ స్పాన్సర్ షిప్ నుంచి తప్పుకున్న వివో... తాజా పరిణామాలతో అసంతృప్తి!

  • ఇటీవల సరిహద్దుల్లో చైనా, భారత్ బలగాల మధ్య ఘర్షణ
  • చైనా సంస్థ వివోపైనా భారత్ లో వ్యతిరేకత
  • 2022 వరకు ఐపీఎల్ తో వివో సంస్థకు ఒప్పందం
VIVO opted out of IPL sponsorship

ఐపీఎల్ అధికారిక స్పాన్సర్ వివో సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాదికి ఐపీఎల్ స్పాన్సర్ షిప్ నుంచి తప్పుకుంది. ఇటీవల సరిహద్దుల్లో చైనా, భారత్ బలగాల మధ్య ఘర్షణల నేపథ్యంలో భారత్ లో చైనా ఉత్పత్తులు, చైనా భాగస్వామ్యాలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో హెచ్చు స్థాయిలో చైనా వ్యతిరేక ప్రచారం జరుగుతుండడం, చైనా సంస్థలపై ఆగ్రహజ్వాలలు రేగడం వంటి పరిణామాలతో చైనా స్మార్ట్ ఫోన్ తయారీ దిగ్గజం వివో తీవ్ర అసంతృప్తికి గురైంది. 2022 వరకు ఐపీఎల్ తో స్పాన్సర్ షిప్ ఒప్పందం ఉన్నాగానీ, ఈ సీజన్ కు స్పాన్సర్ గా తప్పుకోవాలని నిర్ణయించుకుంది.

2018లో వివో సంస్థ ఐపీఎల్ కోసం బీసీసీఐతో రూ.2199 కోట్లకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం ఐదేళ్లపాటు స్పాన్సర్ షిప్ హక్కులు ఉంటాయి. బీసీసీఐ నిన్న కూడా ఓ ప్రకటన చేస్తూ.... తమ స్పాన్సర్లందరూ తమతోనే ఉంటారని స్పష్టం చేసింది. ఎవరినీ తొలగించబోమని పేర్కొంది. కానీ, వివో సామాజిక మాధ్యమాల్లో తమపై వ్యతిరేకత వస్తున్నందున స్వచ్ఛందంగా తప్పుకుంది.

More Telugu News