Pattabhi: సీమ పౌరుషం ఉంటే జగన్ మా సవాల్ స్వీకరించాలి: పట్టాభి

Pattabhi says CM Jagan must accept thier challenge
  • టీడీపీ, వైసీపీ మధ్య రాజధాని రగడ
  • అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు వెళదాం అంటూ చంద్రబాబు సవాల్
  • చంద్రబాబు మళ్లీ మీడియా ముందుకు వస్తారన్న పట్టాభి
రాజధాని అంశంపై ప్రజల ముందుకు వెళదాం, అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళదాం అని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వైసీపీ సర్కారుకు సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. తన సవాల్ ను ప్రభుత్వం అంగీకరించకపోతే మళ్లీ మీడియా ముందుకు వస్తానని చంద్రబాబు స్పష్టం చేశారు. అటు టీడీపీ నేతలు కూడా సర్కారుకు సవాళ్లు విసురుతున్నారు. టీడీపీ ప్రధాన కార్యాలయం నుంచి ఆ పార్టీ నేత పట్టాభి మాట్లాడుతూ, చంద్రబాబు విసిరిన సవాల్ కు జగన్ స్పందించాలని అన్నారు. ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం రండి, మీరు గెలిస్తే మేం ఇక రాజధానిపై మాట్లాడబోము అని స్పష్టం చేశారు.

"చంద్రబాబు విసిరిన సవాల్ కు స్పందించాల్సిందే. ఏమైంది సీమ పౌరుషం? పులివెందుల పులి అని చెప్పుకుంటుంటారు కదా. పులివెందుల పులి ఇవాళ పిల్లిలా మారిపోయిందా? పిల్లిలా మారిపోయి ఏ ప్యాలెస్ లో దాక్కుంది సార్! ఎందుకు బయటకు రాలేకపోతోంది ఈ పులి?

అనిల్ కుమార్ యాదవ్ కు, బొత్స సత్యనారాయణకు, పేర్ని నానికి కూడా సవాల్ విసురుతున్నా... పులి వేషాలు వేసుకున్నట్టు మీడియా ముందుకు వచ్చి రంకెలు వేయడం కాదు... నిజంగా దమ్ముంటే ప్రజాక్షేత్రంలోకి వెళదాం రండి. మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తేలేదు. మీ నిర్ణయాన్ని మీరు వాపసు తీసుకోకపోతే రేపు సాయంత్రం 5 గంటలకు చంద్రబాబు మీడియా ముందుకు వస్తారు. మీరు దిగివచ్చేవరకు మిమ్మల్ని నిలదీస్తూనే ఉంటారు. జగన్ ఇప్పటికైనా సీమపౌరుషం ఉన్న ఒక మనిషిగా రుజువు చేసుకోండి" అంటూ పట్టాభి నిప్పులు చెరిగారు.
Pattabhi
Jagan
Challenge
Chandrababu
Telugudesam
Amaravati
Decentralization
Andhra Pradesh

More Telugu News